- 2029కి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కల సాకారం
- ఈ ఏడాది చివరికి 10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు
- సొంతిల్లు లేనివారు దరఖాస్తులు చేసుకోవాలి
- గత ప్రభుత్వంలో హౌసింగ్ అక్రమార్కులను శిక్షిస్తాం
- అగ్రిటెక్, పంచసూత్రాలతో సేద్యం బలోపేతం
- రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతాం
- వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పద్దుపై ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ప్రతి పేదవానికీ సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే సుమారు 3 లక్షల ఇళ్లకు గృహ వ్రవేశాలు చేపట్టామని… మొత్తంగా ఈ ఏడాది చివరినాటికి 10 లక్షల ఇళ్లకుపైగా గృహప్రవేశాలు చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇళ్లులేని పేదలు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో హౌసింగ్, వ్యవసాయ శాఖ పద్దులపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయా శాఖల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “గత పాలకులు గృహ నిర్మాణం రంగంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం. రాష్ట్రంలో 2.2 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తాం. అందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలను ముమ్మరంగా చేపడుతున్నాం. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటి నుంచి ప్రారంభించాం. ఈ ఏడాది ఉగాదిలోగా దాదాపు 3 లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయిస్తాం. జూన్‌కు 2.26 లక్షలు, సెప్టెంబరులో 2.10 లక్షల ఇళ్లకు కూడా గృహప్రవేశాలు జరిగేలా లక్ష్యం నిర్దేశించుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాయి. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే దీనిపై కార్యాచరణ చేపడతాం. 2029లోగా పేదలందరికీ ఇళ్లు కట్టించటంతోపాటు ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇస్తాం” అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
వ్యవసాయంలో యాంత్రీకరణతోపాటు ఏఐ సేవలు
“అగ్రిటెక్‌తోపాటు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ప్రభుత్వ మద్దతు అనే ఐదు సూత్రాలతో వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. జాతీయ స్థూల ఉత్పత్తిలో 10 శాతంమేర వ్యవసాయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంట్రిబ్యూట్ చేస్తోంది. రైతు సంక్షేమమే రాష్ట్రాభివద్ధికి పునాది. రైతులకు ప్రభుత్వం అందించే ఉచిత విద్యుత్‌కు బడ్జెట్ కేటాయింపులు భారీగా చేశాం. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. ఈ ఏడాది 69 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చాం. 2025-26లో ఉచిత విద్యుత్ కోసం రూ.13,722 కోట్లు కేటాయించాం. ప్రతి రైతుకు 3 విడతల్లో రూ.20,000 ఆర్థిక సాయాన్ని ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం. గత ప్రభుత్వం కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్రవాటాగా రూ.14,000, కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలుపుకుని రూ.20 వేలు ఇస్తున్నాం. 47 లక్షలమంది రైతులకు 2 విడతల్లో రూ.6,309 కోట్లు రైతులకు అందించాం. రూ.310 కోట్లు పంట నష్టం సొమ్మును చెల్లించాం. ధాన్యం కొనుగోళ్లల్లోనూ పారదర్శకత పాటిస్తూ 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నాం. రూ.10,816 కోట్ల మేర రైతులకు నేరుగా చెల్లించాం. గత ప్రభుత్వం రైతులకు పెట్టిన బకాయిలు రూ.1,670 కోట్లు మేమే చెల్లించాం. వ్యవసాయ యాంత్రీకరణతోపాటు ఏఐ ఆధారిత సేవలు రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ పెట్టుబడులు
“ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రానికి రూ.14,230 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 8,168 గ్రామాల్లో 15 లక్షలమంది ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 50 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం 400 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వస్తున్నాయి. దాన్ని 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధికి రూ.30 వేల కోట్లతో క్లస్టర్ ప్రణాళిక చేపట్టామని, ప్రైవేటు రంగంలో వచ్చే పెట్టుబడులతో కలిపి రూ.1 లక్ష కోట్లతో రాయలసీమను ఉద్యాన హబ్‌గా తయారు చేస్తాం. ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50 విద్యుత్ అందిస్తూ ఏపీని ఆక్వా కల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఏలూరులో ప్రపంచంలోనే అతిపెద్ద కోకో సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. నీటి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలతో అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు 6.67 మీటర్లు పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో సగటు 7.31 మీటర్లు మేర భూగర్భ జలాలు ఉన్నాయి. భూ గర్భ జలాలు పెరగడంతో రూ.95 కోట్ల విద్యుత్ ఆదా అయ్యింది. 20 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల విస్తరణ కూడా జరిగింది. రూ.1,634 కోట్ల జీఎస్డీపీ వృద్ధి చెందింది. ఈ యజ్ఞంలో సాగునీటి సంఘాలు కూడా భాగస్వాములు కావాలి. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తాం. కౌలు రైతులను కూడా ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.













