(లండన్‌లో రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరికి అభినందనలతో ప్రత్యేక కథనం)
నిస్వార్ధంగా స్వచ్ఛంద సమాజ సేవకు ఉపక్రమించే వ్యక్తులు.. పరోపకార గుణ సంపన్నులు. ప్రస్తుత సమాజంలో `ప్రతిఫలం ఆశించని సమాజసేవకు అంకితమవ్వాలంటే.. అందుకు ధైర్యం కావాలి. నిబద్ధతను అలవర్చుకోవాలి. అస్థిత్వాన్ని వదిలిపెట్టి.. మనిషిని మనిషిగా చూడగలిగే సుద్గుణాన్ని పుణికిపుచ్చుకోవాలి. అలాంటి వ్యక్తులు అరుదు. అరుదైన మానవతామూర్తులను `ఏదోకరోజు సమాజం గుర్తు పెట్టుకుంటుంది. వాళ్లను సత్కరించుకుని.. తమను తాము సత్కరించుకున్నంత సంబరపడిపోతుంది. ఏపీ రాష్ట్ర ప్రజలకు అమ్మలాంటి నారా భువనమ్మ నేడు లండన్ గ్లోబల్ కన్వెన్షన్‌లో అందుకోనున్న అతర్జాతీయ సత్కారం అలాంటిదే. ప్రపంచంలోని కోట్ల మహిళలకు ఆదర్శంగా నిలుస్తోన్న భువనమ్మకు అభినందనం.. అభివందనం.
1997లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ఎన్టీఆర్ ట్రస్ట్‌ను ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్లున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో సుమారు మూడు దశాబ్దాలుగా లక్షలాది పేద ప్రజలకు సాయమందిస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆ ఘనతకు కారణం `ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చూపించిన అంకితభావం, దాతృత్వమే. ట్రస్టు ద్వారా వేలాది విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఆరోగ్యసేవలు, అత్యవసర రక్తదానం, విపత్తు సాయంవంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు, నిర్వహిస్తూనే ఉన్నారు. సమాజంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘స్త్రీశక్తి’ వంటి కార్యక్రమాల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటువంటి సమాజ సేవామూర్తిని ప్రపంచం గుర్తించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. తెలుగు మహిళా శక్తికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు భువనేశ్వరి. ఎప్పుడూ వెలుగుల్లో ఉండే వ్యక్తి కాదు భువనేశ్వరి. కానీ ఆమె చేసిన సేవలు మాత్రం వెలుగులు పంచుతున్నాయి, విరజిమ్ముతున్నాయి. మౌనంగా సమాజ సేవ చేసినా ప్రభావం గొప్పగా ఉంటుందన్న నిజానికి.. ఆమె సాధించిన అవార్డు నిలువెత్తు సాక్ష్యం. ఉత్తమ భారతీయులు అనేకులు అందుకున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు.. 2025 ఏడాదికి భువనమ్మను వరించడం.. తెలుగుజాతి ఖ్యాతి వినీలాకాశానికి ఎగరడమే! బ్రిటన్ రాజధాని లండన్ గ్లోబల్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమ వేదికపై భువనమ్మ ఈ అవార్డును నేడు అందుకోనున్నారు. ఒకవిధంగా.. తెలుగు మహిళాశక్తి, ఆంధ్రప్రదేశ్ సేవా సంస్కృతికి ప్రపంచమిచ్చిన అద్వితీయ గుర్తింపు ఇది. అంతే కాదు.. హెరిటేజ్ ఫుడ్స్, ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డునూ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనమ్మ అందుకోనుండటం అభినందనీయం, చారిత్రక ఘట్టం!
సామాజిక సేవలో నిస్వార్ధంగా, స్వచ్ఛందంగా పనిచేస్తున్న మానవతామూర్తిగా ప్రత్యేక గుర్తింపు సాధించారు భువనేశ్వరి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులను స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సహిస్తున్నారు. సాంకేతిక ఆధారిత విద్యకు ప్రాధాన్యమిస్తూ.. స్మార్ట్ క్లాస్‌రూమ్స్, డిజిటల్ ల్యాబ్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకులు ద్వారా ప్రాణం పోస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ.. వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా డొనేషన్ డ్రైవ్స్, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీవంటి సేవలు అందించారు. ‘స్త్రీశక్తి’ ద్వారా స్వయం ఉపాధి, వృత్తిశిక్షణ, ఆర్థిక అవగాహన కల్పించే కార్యక్రమాలు, వ్యాపార నైపుణ్యాలు నేర్పి పేద, గ్రామీణ మహిళలను స్వావలంబనవైపు నడిపిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అత్యవసర సాయమందిస్తూ బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపారు. అపరిమిత సేవా భావం, మానవతా ధృక్పథంతో `మానవసేవను జీవనధర్మంగా అనుసరిస్తోన్న అతి కొద్దిమందిలో భువనమ్మది అగ్రస్థానం. ప్రతి సేవా, సామాజిక కార్యక్రమం ఒక కుటుంబాన్ని, గ్రామాన్ని, జీవితాన్ని మార్చగల శక్తిగా నిలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా మానవసేవను విస్తరిస్తోన్న నేటితరం మహిళగా, భవిష్యత్ తరాలకు భువనేశ్వరి
ఆదర్శం అనడం అతిశయోక్తి కాదు.
సమాజంముందు నిలిచే ఎన్నో సమస్యలను పరిష్కరించేందుకు నిస్వార్థంగా ముందుకొచ్చే వ్యక్తులు అరుదు. అలాంటివారిలో భువనమ్మది అగ్రపీఠం. ఆమె నిర్వహిస్తోన్న సేవలలో ఎక్కడా ప్రదర్శన, ప్రచారార్బాటాలు ఉండవు. ఆడంబరాలకు తావుండదు. నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ.. మౌనమునిలా విద్యుక్తధర్మంతో ముందుకెళ్లే మార్గదర్శులలో భువనమ్మ ఒకరు. ఆమె పనితీరు భారతదేశంలోని వ్యాపారవేత్తలకు ఒక రోల్ మోడల్. అందుకే `ప్రజా హృదయాల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్న మహనీయురాలికి దక్కిన అపూర్వ గౌరవాన్ని చూసి.. రాష్ట్రం మొత్తం తామే అవార్డు తీసుకున్నంతగా మురిసిపోతోంది. ఆమె వ్యక్తిత్వం ఆధునిక భారతదేశంలో మహిళా నాయకత్వానికి ప్రతీక. సమాజం కోసం నారా భువనేశ్వరి సాగిస్తోన్న స్వచ్ఛంద సేవా యజ్ఞం ఇదేతీరున కొనసాగాలని, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని మనసారా కోరుకుందాం. లండన్‌లో భువనమ్మకు అందనున్న అంతర్జాతీయ అవార్డు.. భారతీయ నారీశక్తికి, సేవాస్ఫూర్తికి లభించిన గ్లోబల్ గుర్తింపుగా సంబరపడదాం. కీర్తికాంక్షకు దూరంగా.. కర్తవ్య నిర్వహణతో భువనమ్మ సాగిస్తోన్న సమాజ సేవ మహాయజ్ఞాన్ని ఆదర్శంగా తీసుకుందాం, అనుసరిస్తూ ముందుకెళ్దాం!
`నీరుకొండ ప్రసాద్
	    	
 









