- ప్రజా రాజధాని అమరావతిలో క్రియేటర్ ల్యాండ్
- క్రియేటివ్ ల్యాండ్ ఏసియాతో చారిత్రక ఒప్పందం
- భారీగా విదేశీ పెట్టుబడులు, పెద్దఎత్తున అభివృద్ధి
- 25 వేలు ఉద్యోగాల కల్పన లక్ష్యం
- ఎక్స్‌లో సీఎం చంద్రబాబు సంతోషం
అమరావతి (చైతన్యరథం): భారతదేశపు తొలి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్‌ను ప్రజా రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు క్రియేటివ్ ల్యాండ్ ఏసియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ శుభపరిణామాన్ని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ‘ఎక్స్’ వేదికగా ఆయన పేర్కొన్నారు. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందిందని వివరించారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి, పెద్దఎత్తున అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో స్థానికుల ప్రతిభను ప్రపంచానికి అందించే శక్తిమంతమైన సాధనంగా ఈ ఒప్పందాన్ని ఆయన అభివర్ణించారు.
ఈ ప్రపంచస్థాయి సృజనాత్మక టౌన్ షిప్ సినిమాలు, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, కథల తయారీతో పాటు ఏఐ ఆధారిత కంటెంట్‌కు కేంద్రంగా ఉంటుందని వెల్లడిరచారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలతో మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీ వేదిక కానుందని తెలిపారు. సృజనాత్మక, డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా ఇది మారుతుందన్నారు.
ఎంటర్‌టెయిన్‌మెంట్ సిటీ ఆయిన క్రియేటిర్ ల్యాండ్‌లో థీమ్ పార్క్‌లు, గేమింగ్ జోన్‌లు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు. యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ ద్వారా ఆర్టిఫిషియల్ ఆధారిత వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారు. ఏఐ, ఆర్ అండ్ డీ, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, వినోదం, టెక్, పర్యాటక రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను క్రియేటివ్ ల్యాండ్ సృష్టిస్తుంది. క్రియేటర్ ల్యాండ్ ఏర్పాటు తర్వాత ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ హబ్ ద్వారా వినోదంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుంది. పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఎంవోయూ ప్రకారం క్రియేటిర్ ల్యాండ్ ఐదారేళ్లలో రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుందని అంచనా.