- అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భేషుగ్గా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపడుతూనే, బడ్జెట్లో సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ.73,720 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కేటాయించారన్నారు. అందులో బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడంపై మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యమిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. బీసీ సంక్షేమానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిధులు కేటాయించడంపై బీసీ సంఘాల నుంచి విశేష స్పందన వస్తోందని మంత్రి సవిత తెలిపారు.