- ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి
- ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి
- కలెక్టర్ల సదస్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూములకు సంబంధించి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ తయారు చేయాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టులపై చర్చ సందర్భంగా వేర్వేరు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండిపోతున్న భూములను గుర్తించి వాటి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని సీఎం స్పష్టం చేశారు. రీ సర్వే పూర్తయ్యాక ప్రభుత్వ భూములపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఏళ్లుగా వినియోగం లేని భూములను గుర్తించాలన్నారు. వాటి వివరాలను కామన్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ కిందకు తీసుకు రావాలన్నారు. జిల్లాలు, శాఖల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను నమోదు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ ప్రభుత్వ శాఖకు భూమి అవసరమైనా ఈ పోర్టల్ ద్వారా కేటాయించే పరిస్థితి ఉండాలన్నారు. భూమి కొరత అభివృద్ధికి అడ్డంకి కాకూడదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు మంజూరైన తర్వాత భూమి కోసం వెతకకుండా ముందుగానే పారిశ్రామిక, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు.
భూమిని గుర్తించాలని సూచించారు.
మూడు నెలల కార్యాచరణ ముందుగానే… ప్రతి ప్రభుత్వ శాఖ, కలెక్టర్ స్పష్టమైన యాక్షన్ క్యాలెండర్ రూపొందించుకుని నిర్దేశిత గడువులోగా ఫలితాలు సాధించాలన్నారు. కలెక్టర్ల సదస్సు కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా ఫలితాలు సాధించేలా ఉండాలన్నారు. జిల్లాల అధిపతులుగా కలెక్టర్లు అన్ని శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై 360 డిగ్రీల కోణంలో దృష్టి సారించాలన్నారు. శాఖల మధ్య ప్రభావితమయ్యే పనుల్ని కలెక్టర్ పరిష్కరించాలన్నారు. సమస్యల్ని ప్రస్తావించడం ఒక్కటే కాకుండా పరిష్కారం చూపేలా కలెక్టర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. బాధ్యతను మరొకరికి బదిలీచేసే తత్వాన్ని విడనాడాలన్నారు. ముఖ్యమంత్రిగా తాను మూడు నెలల కార్యక్రమాలను ముందే నిర్దేశించుకుంటానని వెల్లడించారు. ప్రతి నెలా ఎస్ఐపీబీ సమావేశాలతో పాటు ప్రతి 15 రోజులకూ కేబినెట్ సమావేశంతో పాటు ప్రతి మూడు నెలలకూ కలెక్టర్ల సదస్సు, ప్రతినెలా నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్తున్నానన్నారు. సీఎంగా తనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుందని, దానికి అనుగుణంగానే ప్రణాళిక చేసుకుంటున్నట్టు సీఎం కలెక్టర్లకు వివరించారు. కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా కలెక్టర్లు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్ణయాల్లో ఎస్కేపిజం కుదరదని, రియాక్టివ్ గవర్నెన్స్ కంటే ప్రోయాక్టివ్ గవర్నెన్సుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
యాక్షన్ టేకెన్ రిపోర్టుపై దిశా నిర్దేశం
ఎస్సీ వర్గాలకు ఇచ్చే ప్రయోజనాలను బుడగ జంగాలకు పొడిగించే అంశంపై తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బుడగ జంగాలకు ఎస్సీ హోదా కల్పించే అంశం పెండింగులో ఉన్న నేపథ్యంలో ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను వారికీ అందించాలని స్పష్టం చేశారు. వివిధ పరిశ్రమలతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని అనుసంధానించాలని కోరారు.
కరిక్యులమ్, పరికరాలు తదితర అంశాలను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన గృహాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. అదనంగా మంజూర య్యే గృహాలను దశలవారీగా అమలు చేయాలని సీఎం నిర్దేశించారు. త్వరలోనే మరో 1.5 లక్షల గృహాలు ఏపీకి అదనంగా మంజూరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరా విషయంలో అత్యవసర పనుల్ని వేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 50శాతం హరిత ప్రాంతాన్ని సాధించేలా ప్లాంటేషన్ సీజన్కు ముందే అవసరమైన 20కోట్ల విత్తనాలను, మొక్కలను సిద్ధం చేసుకోవాలన్నారు. తక్కువ నీటి అవసరం ఉన్న మొక్కల్ని ప్రోత్సహించాలని, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 905 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్రంతో మాట్లాడాలని స్పష్టం చేశారు.














