- రూ.1.50లకే యూనిట్ విద్యుత్
- రాయితీని విస్తరిస్తూ కీలక నిర్ణయం
- జోన్ల విధానం, నిబంధనలు తొలగింపు
- 6,500 ఆక్వా ఫారాలకు ప్రయోజనం
- గత జూన్ 1 నుంచే అమలుకు ఉత్తర్వులు
- పాలకొల్లులో ఆక్వా రైతుల కృతజ్ఞత సభ
- జీవో విడుదల చేసిన మంత్రులు
అమరావతి(చైతన్యరథం): ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసా గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందించనుంది. ఈ మేరకు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీపై మంగళవారం ఎనర్జీ శాఖ జీవో ఆర్టీ నెంబర్- 57 జారీ చేసింది. గత జూన్ 1 నుంచే ఈ రాయితీ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు రూ.1.50లకే యూనిట్ రాయితీని ప్రభుత్వం కల్పించనుంది. ఏపీఎసఏడీఏ, సీఏఏ చట్టాల కింద రిజిస్టరైన అన్ని అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు కూడా రూ.1.50లకే యూనిట్ విద్యుత్‌ను ఏపీ అందించనుంది. సుమారు 6,500 రిజిస్టర్డ్ ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తించనుంది. ఆక్వా జోన్, నాన్ అక్వాజోన్ అనే తేడా లేకుండా రాయితీని అమలు చేయనుంది. భవిష్యత్తులో ఏపీఎస్ ఏడీఏ(ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ), సీఏఏ రిజిస్ట్రేషన్ పొందే అర్హత కలిగిన ఈ ఫారాలకు కూడా రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రాయితీ కల్పించనుంది.
2026 జూన్ 1వ తేదీ నుంచి రూ.1.50లకే యూనిట్ రాయితీని అమలు చేయనుంది. ఆక్వా ఉత్పత్తి వ్యయంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఏపీ సర్కార్ నిర్ణయంతో ఊరట కలిగింది. ప్రపంచ ఆక్వా ఎగుమతుల మార్కెట్‌లో పోటీ ధర, నాణ్యతతో నిలదొక్కు కునేందుకు ఈ విద్యుత్ రాయితీ అందించనుంది. ఆక్వా రైతుల వివరాలను మత్స్యశాఖ డిస్కామ్‌లకు అందించనుంది. మత్స్యశాఖ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం రాయితీ విస్తరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పాలకొల్లులో మంగళవారం అక్వా రైతుల కృతజ్ఞత సభలో మంత్రులు నిమ్మల రామా నాయు డు, కింజరాపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ రాయితీకి సంబంధించి జీవో పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.















