- తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక
- సాధారణం కంటే 39శాతం మేర లోటు వర్షపాతం సూచనలు
- ఎల్‌నినోపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి
అమరావతి (చైతన్యరథం): ‘జలధార-జలహారతి’ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటివనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ‘జలధార-జలహారతి’పై సీఎం శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ పథకం కింద మొత్తంగా 82,865 పనులను గుర్తించగా 79,826 పనులు పూర్తి చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం రూ.3,409.35 కోట్ల పనులు మంజూరు చేసినట్టు తెలిపారు. చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫార్మ్ పాండ్లు, ట్రెంచ్‌ల తవ్వకం వంటి పనులను చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎల్‌నినో తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయని, తద్వారా వర్షపాతం సాధారణం కంటే 39 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జూన్-డిసెంబరు మధ్య సాధారణ వర్షపాతం 867 మిల్లీమీటర్ల మేర నమోదవుతుందని, ప్రస్తుతం 525 మి.మీ. మాత్రమే నమోదవుతుందన్న అంచనాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టులో 56 శాతం మేర లోటు వర్షపాతం ఉండే ప్రమాదం ఉందని చెప్పారు. రిజర్వాయర్ల నీటి నిల్వలపైనా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ బేసిన్లలో ప్రస్తుతం 563.05 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని… గత ఏడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు. ఆగస్టు నుంచి భూగర్భజల మట్టాలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు ఉండటంతో తాగునీటి నిల్వలు, సరఫరాపై పక్కాగా ప్రణాళికలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
అందుబాటులోకి వచ్చిన నీటిని ఒడిసిపట్టండి
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవట్లేదని… ప్రాజెక్టుల్లోకి వస్తున్న నీటిని సమర్థంగా వినియోగించుకుని రిజర్వాయర్లను వీలైనంత మేర నింపాలని సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి వసతి పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాలకు నీరు సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితులున్నప్పటికీ ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతల మేరకు వినియోగిస్తూ పంటలకు అవసరమైన నీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో తక్కువ నీటి వినియోగంతో సాగుచేసే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. నీటి లభ్యత తగ్గిన పరిస్థితుల్లోనూ పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు
వర్షాభావ పరిస్థితుల కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పశువులకు అవసరమైన మేత, నీటి లభ్యతను నిర్ధారించడంతో పాటు అవసరమైనచోట్ల గోకులాలను సిద్ధం చేయాలని సూచించారు. పశు సంపదకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ముందస్తు ప్రణాళికతో పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. నీటి వనరుల సంరక్షణ అనేది నిత్యం జరగాలని చెప్పారు. వివిధ కారణాల వల్ల చాలా కాలంగా నీటి లభ్యత లేని చెరువులు, కాల్వలను గుర్తించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు నీరు ఉన్న ప్రాంతాల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మైక్రో బేసిన్ అనుసంధాన అవకాశాలను పరిశీలించాలన్నారు. సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.












