- రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా కృషి
- వైసీపీ అరాచకాన్ని గుర్తించి 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు
- అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించే వారికి గుణపాఠం తప్పదు
- మచిలీపట్నంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చైతన్యరథం): రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను ప్రజలందరికీ తెలియజేయడమే లక్ష్యంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం పెద్దయాదరలో ఇంటింటింకీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. అ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు దాదాపు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో పాలన ప్రారంభించామన్నారు. ఐదేళ్లు కష్టబడి రాష్ట్రాన్ని గాడిన పెట్టాం. ఆదాయం పెంచుకుంటూ వృద్ధిలో నడిపించాం. 2019 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు. వైసీపీ అరాచకాన్ని ఇంక భరించలేమని ప్రజలంతా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉంది. దీనికి తోడు జగన్ రెడ్డి అరాచకం, అప్పుల కారణంగా ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకు, అప్పులకే సరిపోతోంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షత చాటుకుంటూ.. పాలన సాగిస్తున్నారు. పెద్దయాదరలో 424 మందికి రూ.18.86 లక్షలు పెన్షన్ల రూపంలో అందిస్తున్నాం. తల్లికి వందనం పథకం ద్వారా 188 మందికి రూ.28.20 లక్షలు అందించాం. అన్నదాత సుఖీభవ ద్వారా 258 మందికి రూ.52.98 లక్షలు ప్రయోజనం చేకూర్చాం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా 16 మందికి లబ్ది చేకూర్చాం. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 16 మందికి రూ.2.40 లక్షలు అందించాం. ఇలా అనేక పథకాలు అమలు చేశాం. కొత్త పెన్షన్లు కూడా గుర్తించి అందిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4000 పెన్షన్లు అందిస్తున్నాం. పెన్షన్ల కోసమే దాదాపు 64 లక్షల మందికి ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 8 లక్షల కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేయబోతున్నాం. రాష్ట్రంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేయొచ్చు. అయినప్పటికీ.. ప్రజా సంక్షేమం కూడా ముఖ్యమేనన్న ఉద్దేశ్యంతో పెన్షన్లు అందిస్తున్నాం.
పూర్తిగా మంచానికే పరిమితం అయిన వారికి ఏకంగా రూ.15 వేలు అందిస్తున్నాం. గతంలో జగన్ రెడ్డి కేంద్రం సొమ్ముతో కలిపి రైతులకు రూ.13వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ నేడు అన్నదాత సుఖీభవతో ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున అందిస్తున్నాం. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ద్వారా రూ.10,500 కోట్లు అందించాం. కొన్ని కుటుంబాల్లో ఐదారు మందికి కూడా తల్లికి వందనం జమ అయింది. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు సదుపాయం కల్పించాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని విపత్కర పరిస్థితుల కారణంగా యాదర రోడ్డు నిర్మాణ పనులు జాప్యమవుతున్నాయి. త్వరలోనే టెండర్లు పిలిచి పనులన్నింటినీ పూర్తి చేస్తాం.
కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మంచినీరు, విద్యుత్ కనెక్షన్లు, డ్రైనేజీపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించి చూపిస్తాను. ప్రతి సమస్యనూ అధికారులతో మాట్లాడి పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ కుంచె నాని, చిన్నాపురం మాజీ సర్పంచి గోపాల్ రావు, కృష్ణమూర్తి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.
















