- ప్రజలు అభివృద్ధి, ఉపాధి కోరుకుంటున్నారని వ్యాఖ్య
అమరావతి (చైతన్య రథం): కోట్లాదిమంది హిందువుల మనోభావాలు ముఖ్యమా? రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమో? జగన్ చెప్పాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే రావణకు జగన్ మద్దతిస్తానంటారా? అని నిలదీశారు. “వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం హిందూమతాన్ని తక్కువ చేసి చూపిస్తారా? పరిమితులు దాటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. హిందూ సమాజాన్ని కించపరచడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్, రావణ్, గొడ్డలి పార్టీకి ఎవరు అధికారమిచ్చారు. స్వేచ్చను ఆధారంగా చేసుకొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడతామంటే ఒప్పుకొనేది లేదు. వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు హిందూమతాన్ని ఏనాడూ కించపరచలేదు. మఠాధిపతులు, పూజారులను గౌరవించే సంస్కృతి మనది. మీ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూమతాన్ని విచ్ఛిన్నం చేస్తారా? విద్వేషాలు రెచ్చగొట్టే అధికారం జగన్, రావణ్, గొడ్డలి పార్టీకి ఎవరిచ్చారు?” అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తుంటే, ప్రతిపక్షం మాత్రం కులాలు, మతాలు, ప్రాంతాలమధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు ప్రాధాన్యమిస్తోందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోందని మంత్రి ఆనం హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలనుంచి లభిస్తున్న విశేష ఆదరణను జీర్ణించుకోలేక కొందరు ఉద్దేశపూర్వక దుష్ప్రచారాలు, సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రజా వేదికలను ఉపయోగించి మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి స్పష్టం చేశారు.
మత విశ్వాసాలను అవమానించే వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను రాజకీయంగా సమర్థించడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ప్రతిపక్ష నాయకత్వం రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని మంత్రి ఆనం డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు అల్లర్లు, కులాలమధ్య చిచ్చులు, విద్వేషాలు అవసరం లేదని.. అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఇతరుల మత విశ్వాసాలను అవమానించే హక్కు కాదని, రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చిందిగానీ విద్వేషాన్ని వ్యాప్తి చేసే లైసెన్స్ ఇవ్వలేదని మంత్రి ఆనం స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు సీతారామాంజనేయ ప్రసాద్, కమినషర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు.














