శ్రీసిటీ (తిరుపతి): స్కిల్ గ్యాప్ భర్తీ చేసేందుకు శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు తెలిపారు. మనదేశంలో ఏటా 10 మిలియన్లకు పైగా యువత సాంప్రదాయ డిగ్రీలు చదివి బయటకు వస్తున్నా వారిలో 50 శాతానికి పైగా ఉపాధికి సరిపడా స్కిల్స్ ఉండటం లేదని పేర్కొన్నారు. శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. స్కిల్స్ లేకపోవడం వల్ల 18-22 సంవత్సరాల మధ్య వయసు గల యువ త నుంచి ఎటువంటి ప్రొడక్టివిటీ కనిపించడం లేదు. ఇది ఆందో ళనకరమైన పరిణామం. వీరిలో 95 శాతం మంది మెంటారింగ్, హ్యాండ్ హోల్డింగ్ కోరుతున్నారు. ఈ స్కిల్ గ్యాప్ భర్తీ చేసేందుకు శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సింగపూర్, కెనడా, జర్మనీ వంటి దేశాల్లో వివిధ యూనివర్సిటీలు వర్క్ స్టడీ మోడల్ అమలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్యారంటీ ఎంప్లాయిబిలిటీ ఇవ్వాలని మాకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఎసఐయుని తీర్చిదిద్దామని వివరించారు. ఇక్కడ ఇంక్యుబేషన్/ ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రవీణ్ అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్నెగి మెలాన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ రాజారెడ్డి, కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి జీకే పిళ్లై తదితరులు పంపిన సందేశాలను వినిపించారు.
















