- విశాఖ సదస్సు కంటే ముందుగా 5 చోట్ల ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు
- కొత్త ఆలోచనలకు… అవకాశాలకు సీఐఐ సదస్సు వేదిక కావాలి
- ఎంఓయూలు, పెట్టుబడులతోపాటు నాలెడ్జ్ షేరింగ్ మీద ఎక్కువ దృష్టి
- సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహాక సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): విశాఖ భాగస్వామ్య సదస్సు గతానికి భిన్నంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈసారి ప్రాంతీయస్థాయిలో కూడా సదస్సులు నిర్వహించాలని సూచించారు. నవంబర్ నెలలో నిర్వహించే 31వ సీఐఐ సదస్సుపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ప్రాంతీయ స్థాయిలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించే అంశంపై చర్చించారు. నావిగేటింగ్ ఛేంజ్: లీడర్‌షిప్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ఏ ట్రాన్స్‌ఫార్మింగ్ వరల్డ్ థీమ్‌తో 31వ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో భాగంగా ఎంఓయూలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలతో రెండు రోజుల భాగస్వామ్య సదస్సు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్‌ను ఆహ్వానించాలని సీఎం సూచించారు.
భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలకు లేఖలు రాయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని సీఎం చెప్పారు. ఈ మేరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవిదేశాల్లో రోడ్ షోలు చేపట్టాలని ఆదేశించారు. దీంట్లో భాగంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సీఐఐ పార్టనర్ షిప్ సదస్సులకు సంబంధించి రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ప్రధాన భాగస్వామ్య సదస్సుకంటే ముందుగానే విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంతే కాకుండా.. ఈ సదస్సుల్లో ఎంఓయూలు కుదర్చుకునే అంశంపై అధికారులు ఎలాంటి ప్రణాళికలు చేపట్టారని ముఖ్యమంత్రి అడిగారు. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉంటుందో బేరీజు వేసుకుని.. ఆ మేరకు ఆయా ప్రాంతీయ సదస్సుల్లో ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
లీడర్లదే భవిష్యత్…
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “భాగస్వామ్య సదస్సులంటే కేవలం పెట్టుబడులు రాబట్టడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం అనే భావన పోవాలి. భాగస్వామ్య సదస్సుల్లో వివిధ కీలక అంశాల మీద చర్చ జరగాలి. ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి… ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నామనే దానికంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత వరకు చేసుకోగలుగుతున్నామనేది ముఖ్యం. అందుకే విశాఖలో జరగబోయే 31వ భాగస్వామ్య సదస్సులో జరిగే కార్యక్రమాలపై ప్రజలు చర్చించుకోవాలి. వినూత్నంగా ఆయా రంగాలను ఏ విధంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలు రేకేత్తించాలి. టెక్నాలజీ సహా వివిధ అంశాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆయా రంగాల్లో ఛాంపియన్‌గా నిలిచిన వాళ్లే గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్నారు. ఫ్యూచరిస్టిక్ రంగాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన నిపుణులు భాగస్వామ్య సదస్సుకు వచ్చేలా చూడాలి. సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. విశాఖలో జరగబోయే పార్టనర్‌షిప్ సమ్మిట్లో పబ్లిక్ పాలసీలపై కీలక చర్చలు జరగాలి. వ్యాపారాలు, పెట్టుబడులువంటి అంశాలతోపాటు ఆయా రంగాల్లో సవాళ్లు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలనే అంశంపై రకరకాల చర్చలు జరగాలి. వ్యవసాయం, ఉద్యానరంగం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, స్ట్రెస్ ఫ్రీ వర్క్‌వంటి అంశాలపై చర్చించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
కీలకంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
“భాగస్వామ్య సదస్సును వినూత్నంగా నిర్వహించాలి. విశాఖలో ప్రధాన కార్యక్రమం చేపట్టడంతో పాటు.. ప్రాంతాల వారీగా భాగస్వామ్య సదస్సులు చేపట్టాలి. ప్రాంతీయ స్థాయిలో భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తే.. ప్రజలు, యువత, విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుంది. కొత్త ఆలోచనలను ప్రజలకు చేరవేయడం… అలాగే యువతలోని ఇన్నోవేషన్లను ఆయా రంగాల పారిశ్రామిక పెద్దల దృష్టికి వెళ్లడం అనేది సాధ్యమవుతుంది. ప్రాంతాల వారీగా నిర్వహించే సదస్సుల్లో స్టార్టప్ కంపెనీలకు.. ఇన్నోవేషన్లకు అగ్రభాగం ఉండాలి. అలాగే ప్రాంతీయ సదస్సుల్లోనూ ఎంఓయూలు కుదుర్చుకునే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒక్కచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగితే… ప్రభుత్వం చేస్తున్న కృషి.. పడుతున్న కష్టం ప్రజలకు అర్థమవుతుంది. ఈ సదస్సుల్లో జెన్ జీ భాగస్వామ్యం ఉండేలా చూడాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు. సన్నాహక సమీక్ష సమావేశానికి మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














