చిలకలూరిపేట(చైతన్యరథం): పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు శనివారం సందర్శించారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నెట్ జీరో విధా నంలో భాగంగా రూ.32 కోట్లతో రాష్ట్రంలోని 44,346 అంగ న్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్ లు, పాత్రలను అంద జేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి లింగంగుట్ల అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను అందజేశారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని సరుకుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన సీఎంకు ముందుగా టీచర్, సహాయకురాలు స్వాగతం పలికారు. అంగన్ వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు ఇచ్చే పోషకాహారం, ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు అందిస్తోన్న సేవలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండక్షన్ స్టవ్‌ను అందుకున్న అంగన్వాడీ సహాయకురాలు సీఎం సమక్షంలోనే రాగి జావను కాచారు. చిన్నారులతో మమేకమై వారితో కలిసి కింద కూర్చుని సీఎం రాగి జావ తీసుకున్నారు. కాసేపు వారితో ముచ్చటించారు. పచ్చదనం పెంపులో భాగంగా అంగన్వాడీ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులు పాల్గొన్నారు.














