- ఏ తప్పూ జరక్కపోయినా నిరుద్యోగుల్లో గందరగోళమే లక్ష్యంగా జగన్, ఆయన ముఠా యాగీ
- అవినీతిపై చర్చకు రమ్మని పదే పదే సవాల్ చేస్తున్నా పారిపోతున్న వైసీపీ నేతలు
- గతంలో మంత్రిగా ఉన్నప్పుడు టీచర్ల బదిలీల పేరిట రూ.50 కోట్లు వసూలు చేసిన బొత్స
- కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపింది.
- ‘డబ్బులిస్తేనే ఉద్యోగాలు’ అంటూ వైసీపీ విషప్రచారం
- డీఎస్సీ ఉద్యోగాల్లో ఏ ఒక్కరైనా డబ్బులిచ్చినట్లు నిరూపించగలరా?
- మెరిట్ ఆధారంగా వైవీ సుబ్బారెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తికీ టీచర్ ఉద్యోగం
- డీఎస్సీపై చర్చకు జగన్ వస్తానంటే.. ఏపీలోనైనా, ఢిల్లీ, బొంబాయి.. ఎక్కడైనా మంత్రి లోకేష్ సిద్ధం
- మీడియాతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
అమరావతి (చైతన్యరథం): ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) అత్యంత పారదర్శకంగా జరిగి, ఎలాంటి తప్పులు, పొరపాట్లూ లేకుండా నియామకాలు పూర్తయి ఏడాది కాలం గడిచిన తరువాత.. గత మూడు వారాలుగా నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన ముఠా నానా యాగీ చేస్తోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లేని సమస్యను ఉన్నట్లు చూపిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో ఎక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడ పారదర్శకత లోపించిందో రండి.. చర్చిద్దాం అని మేము పదే పదే సవాల్ చేస్తున్నా వైసీపీ నేతలు పారిపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం గవర్నర్‌కు, శుక్రవారం ఢిల్లీలో ప్రధానికి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారు. బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, తదితరులకు ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా.. వాళ్లకు ఏ అభ్యర్థి పైన అయినా అనుమానాలు ఉంటే లిస్ట్ పట్టుకుని వస్తే విద్యాశాఖ, క్రీడాశాఖ అధికారులను కూర్చోబెట్టి వాళ్ల ప్రతి సందేహానికి సమాధానం చెప్పిస్తాం. అక్కడికి వస్తే వాళ్ళ డొల్లతనం, ఆరోపణలన్నీ ఫేక్ అని తేలిపోతాయనే భయంతోనే రావడం లేదని రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
లంచాల సొమ్ము పోయిందనే బొత్స అక్కసు
బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రూ.50 కోట్ల రూపాయలు వసూలు చేసి, 2,000 మంది ఉపాధ్యాయుల బదిలీల్లో అక్రమాలకు తెరలేపారు. ఎన్నికల కోడ్ రావడంతో ఆ బదిలీలు ఆగిపోయాయి. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక ఆ అక్రమ బదిలీలపై విచారణ జరిపి పూర్తిగా నిలిపివేశారు. వసూలు చేసిన ఆ రూ.50 కోట్లను ఉపాధ్యాయులకు, దళారులకు వెనక్కి చెల్లించాల్సిన దుస్థితి రావడం వల్లే బొత్సకు మంత్రి లోకేష్‌పై ఇంత అక్కసు, కోపం అని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో ప్రశ్నపత్రాల అప్‌లోడ్ నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రతిదీ అత్యంత పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మక టాటా కంపెనీ ఆధ్వర్యంలో, అత్యంత సురక్షితమైన వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ వారిలో ఆత్మస్థైర్యం నింపుతుంటే.. వైసీపీ మాత్రం ‘డబ్బులు ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయి’ అనే విషప్రచారం చేస్తూ యువత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని రాంగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మంచి జరుగుతుంటే చూడలేకనే..
ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి, త్వరలోనే మరో డీఎస్సీ కూడా రాబోతోంది. ఇంత మంచి జరుగుతుంటే యువతలో భయాందోళనలు సృష్టించడం వైసీపీ దుర్మార్గపు బుద్ధికి నిదర్శనం. డీఎస్సీ ఉద్యోగాలను రూ.10 లక్షలకు, రూ.15 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు కదా.. డబ్బు ఇచ్చినోడిని కానీ, తీసుకున్నోడిని కానీ ఒక్కరినైనా చూపించగలరా? ఆ సవాల్‌ను ఎదుర్కొనే దమ్ము మీకు లేదు. మీలాగా, మీ నాయకుడి లాగా అవినీతి సొమ్ము, రక్తపు కూడు తినాల్సిన మాకు అవసరం లేదు. నిరుద్యోగుల పొట్టకొట్టి, అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య స్థితి లోకేష్‌కి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ లేదు. ఈ డీఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. వారంతా పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే. అందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు.
కావాలంటే మీ ‘సాక్షి’ టీవీని పంపి వాళ్లతో మాట్లాడించండి.. వాళ్ల సంతోషం ఏంటో మీకే తెలుస్తుంది. ఉద్యోగాలు సాధించిన 16 వేల మందికి పైగా కుటుంబాలు సంతోషంగా ఉంటే, మీరు మాత్రం వారి జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు. ఆయా కుటుంబాల్లో నిద్రలేని రాత్రులు మిగులుస్తూ వారి గుండెల్లో గొడ్డలిపోటు పొడుస్తున్నారు. నిరుద్యోగులకు నిజమైన అన్యాయం చేస్తోంది వైసీపీ నేతలే. ఉద్యోగాలు రాని అభ్యర్థులను కూడా రెచ్చగొట్టి, భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు రాకుండా చెడగొట్టాలని చూస్తున్నారని రాంగోపాల్ రెడ్డి తప్పుబట్టారు.
లిక్కర్ కుంభకోణంపై దృషి మళ్లించేందుకే..
డీఎస్సీలో టీడీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. ఈ 16 వేల మందిలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా ఉన్న ఒక్క యువకుడికైనా అక్రమంగా ఉద్యోగం వచ్చినట్లు నిరూపించగలరా అని సుబ్బారెడ్డికి సవాల్ విసురుతున్నాం. ఈ డీఎస్సీలో వైసీపీకి చెందిన వందలాది మంది యువతీ యువకులకు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు వచ్చాయి. చివరికి వైవీ సుబ్బారెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తికి కూడా ఉద్యోగం వచ్చింది. మరి వాళ్లందరినీ ఉద్యోగాల్లోంచి తీసేద్దామా? ఎవరైనా ఒక్క రూపాయి లంచం ఇచ్చారని గానీ, కనీసం ఒక కప్పు టీ తాగించారని గానీ నిరూపించే దమ్ముందా? 2019-2024 మధ్య మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏ రోజైనా రాష్ట్ర అభివృద్ధి కోసమో, విభజన సమస్యల కోసమో ఢిల్లీకి వెళ్లి వినతిపత్రాలు ఇచ్చి వచ్చారా? ఈరోజు ఏ తప్పూ జరక్కపోయినా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరువు తీయడానికే ఢిల్లీ వీధుల్లో డ్రామాలు ఆడుతున్నారు.
మీరు నిజంగా ఫిర్యాదు చేయాలనుకుంటే డీఎస్సీపై కాదు.. గత ఐదేళ్లలో తిరుమలలో హిందూ ధర్మాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, చుక్క నెయ్యి లేకుండా లక్షలాది లడ్డూలు తయారు చేసి భక్తులను ఎలా మోసం చేశారో దానిపై విచారణ జరపమని ప్రధానికి ఫిర్యాదు చేయండి. విశాఖ ఏజెన్సీలో లాటరైట్ పేరుతో మీ జగన్ ముఠా చేసిన కోట్లాది రూపాయల బాక్సైట్ దోపిడీపై విచారణ కోరండి. ఈ గొడవకంతటికీ అసలు కారణం డీఎస్సీ కాదు, గత ప్రభుత్వ లిక్కర్ కుంభకోణం దారులన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు వస్తున్నాయి. ఈడీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ అసలు లబ్ధిదారుడిని తేల్చబోతోంది. దానిపై ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్ట్ చేయడానికే వైసీపీ ఈ డీఎస్సీ డ్రామాలు ఆడుతోంది. డీఎస్సీ పేపర్ లీక్ అయిందని మాట్లాడుతున్నారు.. లీక్ చేస్తే అది మీరే చేయాలి. 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప డీఎస్సీలో పేపర్లు లీక్ చేసి, ఓఎంఆర్ షీట్లను మీ కంట్రోల్‌లో పెట్టుకుని మోసం చేసింది మీ పార్టీ కాదా? గత ప్రభుత్వంలో జరిగిన గ్రూప్-1 కుంభకోణాలు, కాపీయింగ్‌లపై ఎందుకు నోరు మెదపరు? డీఎస్సీలో మొదట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే ప్రిలిమినరీ సెలక్షన్ లిస్ట్ పెట్టారు. సర్టిఫికెట్లు అన్నీ కూలంకషంగా పరిశీలించిన తర్వాతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు.
ఇందులో తప్పు ఎక్కడ జరిగింది? ఈ 16 వేల మందికి పైగా సెలక్షన్ లిస్టును తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని మీ ఇష్టానుసారంగా దిద్ది ఉంటే, ప్రశ్నపత్రాలను మీ ‘సాక్షి’ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింట్ చేసి ఇచ్చుంటే మీకు అది చాలా పారదర్శకంగా అనిపించేదేమో! ప్రశ్నలు మీ ప్యాలెస్‌లో తయారు కాలేదనే కడుపుమంటతోనే బొత్స, సుబ్బారెడ్డి ఈరోజు ఏడుస్తున్నారు. పత్రికలు, టీవీలు ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో స్పష్టంగా చూపిస్తున్నాయి. తప్పు జరిగితే తప్పు అని చెప్పే మీడియా.. మీరు చేస్తున్నవన్నీ అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలు కాబట్టే మిమ్మల్ని తప్పుబడుతోంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ‘బ్రిడ్జ’ ఆటను పెట్టడంపై రచ్చ చేస్తున్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తించిన 65 ఆటల్లో ‘బ్రిడ్జ’ ఒకటి. ఇది జూదం ఆట అయితే, దీనివల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటుంటే.. ఈ ఆటను రద్దు చేయమని ప్రధానికి, కేంద్ర క్రీడామంత్రికి ఉత్తరం రాయండి. అంతేగానీ, 2020 నాటి కేంద్ర ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం మేము అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతారా అని రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
గోబెల్స్ వారసుల్లా వైసీపీ నేతలు..
హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల అమలుపై విద్యాశాఖ, క్రీడాశాఖ అధికారులు పాయింట్ టు పాయింట్ స్పష్టంగా సమాధానం చెప్పారు. కానీ మీరు మాత్రం చెవుల్లో పాదరసం పోసుకుని, ఏమీ వినపడని చెవిటివారిలా ప్రవర్తిస్తే ఎవరూ ఏమీ చేయలేరు. మొదట నవీన్ అన్నారు, తర్వాత ఐదారుగురు క్రీడాకారులు అన్నారు.. అవన్నీ ఫేక్ అని తేలిపోయాయి. గతంలో మీ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వాళ్లకు, సరైన బ్యాకప్ సర్టిఫికెట్లు లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 2,300 మంది లిస్టును మీ మొఖాన కొట్టేసరికి ఆ ఆరోపణలను పక్కన పెట్టేశారు. చివరికి చేసేదేం లేక కులం కార్డు ఎత్తారు. పనికిమాలిన వాళ్లతో ఇంటర్వ్యూలు ఇప్పించారు. స్పోర్ట్స్ కోటాలో కేవలం 9 మంది కమ్మ సామాజికవర్గం వారికి ఉద్యోగాలు వస్తే..
విజయ్ కుమార్ లాంటి మాజీ ఐఏఎస్ అధికారులతో మొత్తం వాళ్లకే ఇచ్చేశారంటూ అడ్డగోలుగా దుష్ప్రచారం చేయించారు. ఆ అబద్ధం కూడా నిగ్గు తేలడంతో నోళ్లు మూతపడ్డాయి. గవర్నర్ దగ్గరికి, ఢిల్లీ వీధుల్లోకి వెళ్లి మీరు ఎన్ని రచ్చలు చేసినా నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోదు. మీకున్న అవలక్షణాలన్నీ మాకు అంటగట్టాలని చూస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుందనే ‘గోబెల్స’ సూత్రాన్ని వంటపట్టించుకున్న మీరు.. ఏపీలో గోబెల్స్ వారసులుగా మిగిలిపోయారు. నిజంగా అన్యాయం జరిగితే మీతో పాటు ఒక్క పదిమంది అభ్యర్థులైనా గవర్నర్ దగ్గరికో, రాష్ట్రపతి దగ్గరికో వచ్చేవారు కదా? ఎందుకు రావడం లేదు? మిమ్మల్ని నమ్మి వస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు రాకుండా చేయడానికి, తమను తప్పుడు పనులకు వాడుకోవడానికే మీరు చూస్తున్నారని నిరుద్యోగ ఉపాధ్యాయులకు బాగా అర్థమైంది. అందుకే ఉద్యోగం రాని వాళ్లు కూడా మీ ఆలోచనలను గ్రహించి మీకు దూరంగా ఉంటున్నారని రాంగోపాల్ రెడ్డి చురకలు అంటించారు.
ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం..
రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటి గురించి మాట్లాడరు. పొద్దున లేస్తే ఓన్లీ డీఎస్సీ, డీఎస్సీ అంటూ మంత్రి లోకేష్‌ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ ఎప్పుడో చెప్పారు. లోకేష్ సవాల్ విసిరితే బియ్యం దొంగ, గోడౌన్ దొంగ పేర్నినాని కాదు రావాల్సింది.. మీ జగన్మోహన్ రెడ్డి వస్తానంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అయినా, ఏపీ బయట అయినా, ఢిల్లీ లేదా బొంబాయిలో ఒక పెద్ద అనలిస్ట్ సమక్షంలో చర్చ పెడదాం, రమ్మని జగన్‌ను ఒప్పించండి. మేము మా లోకేష్‌ని తీసుకొస్తాం. బొత్సకు, పేర్ని నానికి, రోజు అరిచే వాళ్లకు ఇదే మా సూటి సవాల్. మేము ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ స్థాయి వ్యక్తులను పంపిస్తారో ప్లేస్, టైమ్, పేర్లు చెప్పండి.. అదే స్థాయి వ్యక్తులను మేము పంపుతాం. మీ మాజీ మంత్రులు వస్తే.. మా మాజీ మంత్రులు వస్తారు. మీ జగన్ వస్తే.. మా లోకేష్ వస్తారు. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తే.. మా వాళ్లూ వస్తారు. చివరికి మీ గ్రామ, మండల అధ్యక్షులు వస్తే.. మా వాళ్లనూ పంపిస్తాం. ఈ సవాల్‌కు మేము ఎప్పుడూ సిద్ధమే, మీరు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పండి. తాడేపల్లిలోని మీ పార్టీ ఆఫీసులో కూర్చొని చర్చిద్దామన్నా మాకేమీ ఇబ్బంది లేదు. మీరెంత మంది వస్తారో ఆ లిస్ట్ ఇవ్వండి.. మా వాళ్లూ అంతమంది వచ్చి మీ ఆఫీసులోనే కూర్చొని చర్చిస్తారు. అధికారులను ముందర పెట్టుకొని చర్చిద్దామంటే సచివాలయానికి పోదాం. మీరొక లేఖ పెట్టండి, మేమొక లేఖ పెడతాం. టైమ్ ఫిక్స్ చేస్తే విద్యాశాఖ, క్రీడాశాఖ అధికారుల ముందు మీ అనుమానాలన్నీ నివృత్తి చేస్తాం.
లేదు మీడియా ముందు చర్చిద్దామంటే చర్చిద్దాం.. మేము మొన్న మీడియా సమక్షంలో చర్చ పెట్టి, తిరుపతి ప్రెస్ క్లబ్‌కు రమ్మని పిలిచాం. మీ వైసీపీ తరపున చర్చించడానికి భూమన కరుణాకర్ రెడ్డినో లేదా చిత్తూరు జిల్లాకు చెందిన మీ పార్టీ ఎమ్మెల్సీలనో పంపించాల్సింది కదా! మా వైపు నుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రెస్ క్లబ్‌కు వెళ్లారు. మరి మీకున్న చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల వైసీపీ ఎమ్మెల్సీలను ఎందుకు పంపించలేదు? సమాధానం చెప్పలేకే కదా మీరు పారిపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపైనా, ఎల్లుండైనా, 10 రోజులకైనా సరే మీరు చర్చకు రెడీగా ఉంటే చెప్పండి.. మేం సిద్ధం. ప్రశాంతమైన వాతావరణంలో, ఎవరూ లేకుండా కేవలం మీడియాను మాత్రమే రిక్వెస్ట్ చేసి ఈ చర్చను లైవ్ టెలికాస్ట్ చేయిద్దాం.. వాస్తవాలు ఏంటో ప్రజల ముందే నిగ్గు తేలుద్దాం. అంతే తప్ప.. “మేము నిజాలు తేల్చడానికి సిద్ధంగా లేము, చర్చకు రాము, కేవలం అల్లరి చేస్తూ కూర్చుంటాం” అంటే మాత్రం కుదరదు. మీ నాటకాలు చూస్తూ ఊరుకోవడానికి నిరుద్యోగులు సిద్ధంగా లేరు. వైసీపీ తీరుపై యువత తిరగబడటం ఖాయం, జాగ్రత్త అని రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
అసెంబ్లీకి రండి..చర్చిద్దాం
జగన్మోహన్ రెడ్డికి నేను స్పష్టంగా చెప్తున్నా.. రానున్న వర్షాకాల సమావేశాల్లో మీరు అసెంబ్లీకి రండి. డీఎస్సీ లో ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ అన్యాయం జరిగిందో లిస్ట్ పట్టుకొచ్చి సభలో ప్రశ్నించండి. మా ప్రభుత్వం దానికి దీటుగా సమాధానం చెబుతుంది. మీకు శాసనమండలి లో ఎమ్మెల్సీలు ఉన్నారని అక్కడ రచ్చ చేయడం కాదు, కేవలం 11 మంది ఉన్నా సరే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడండి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఇందుకే. డీఎస్సీ అనుమానాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక రోజు కాదు, రెండు రోజులైనా సరే పాయింట్ టు పాయింట్ మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ సవాల్‌ను ఎదుర్కోవడానికి మీకు ధైర్యం లేదు. మేము ఎంత అరిచి చెప్తున్నా, అధికారులు అన్ని వివరాలు బయటపెడుతున్నా వైసీపీ నేతలకు ఏమీ వినపడటం లేదని మండిపడ్డారు. ఇది సరిగ్గా ‘చెవిటోని ముందు శంఖం ఊదినట్లు’ ఉందని ఎద్దేవా చేశారు. వినే ఓపిక, నిజాలను గ్రహించే శక్తి లేనట్లు నటిస్తూ, చెవుల్లో పాదరసం పోసుకుని కూర్చున్న వారిని ఆ భగవంతుడు కూడా రక్షించలేడన్నారు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా బురదజల్లే రాజకీయం పక్కనబెట్టి, చర్చల సవాల్‌కు సిద్ధం కావాలని రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.















