- టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో 27, 28 తేదీల్లో నిర్వహణ
- ‘ఆయిల్ క్రైసిస’, పొదుపు చర్యల్లో భాగంగా నిర్ణయంతె
- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా వెల్లడి
మంగళగిరి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆదేశాలు మేరకు ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న పసుపు పండుగ మహానాడు ఈసారి హైబ్రిడ్ మోడ్లో జరపాలని పార్టీ నిర్ణయించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం, ప్రస్తుతం దేశంలో ఉన్న చమురు సంక్షోభం ప్రభావం దృష్ట్యా బాధ్యతగా వ్యవహరించాలని జాతీయ అధ్యక్షులు భావించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఈనెల 27, 28 తేదీల్లో హైబ్రిడ్ మోడ్లో నిర్వహించనున్న మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, స్టేట్ బాడీ సభ్యులు పాల్గొంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1848 క్లస్టర్ల వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టర్ దగ్గర సుమారు 500మంది కార్యకర్తలు వీక్షించేలా ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. మే 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన మినీ మహానాడులు, 23, 24 తేదీల్లోని పార్లమెంట్ స్థాయి మహానాడులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.













