- కడపుమంటతోనే అన్న క్యాంటీన్లు మూసేసిన గత ప్రభుత్వం
- అందరి ఆకలి తీరుద్దామని సీఎం చంద్రబాబు పిలుపు
- పుట్టినరోజున క్యాంటిన్‌లో స్వయంగా వడ్డించిన సీఎం దంపతులు
అమరావతి (చైతన్య రథం): సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావొచ్చన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్‌కు అల్పాహారం నిమిత్తం వచ్చేవారికి స్వయంగా ఇరువురూ వడ్డించారు. అనంతరం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…. “అన్నవితరణకు శక్తిమేరకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చు. అన్నదానంలో అందరూ భాగస్వాముల కావాలని పిలుపునిస్తున్నా. ఎవర్నీ బలవంతం చేయడం లేదు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదు. ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ… దేశానికి అన్నంపెట్టిన రాష్ట్రం మన ఏపీ. అన్న క్యాంటీన్లలో పేదల ఆనందం చూస్తే చాలా సంతృప్తినిచ్చింది. పటమట అన్న క్యాంటీన్ చాలా పరిశుభ్రంగా ఉంది. పేదలు మూడు పూటలా భోజనం చేసే అవకాశం క్యాంటీన్లలో లభిస్తోంది. రూ.5లకే మంచి ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆటో డ్రైవర్లు, ముఠా కార్మికులు, పేదలు బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాలి. అక్షయపాత్ర ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్‌తో ఆహారం ఎంతో రుచిగా, నాణ్యతతో అన్న క్యాంటీన్లకు సరఫరా చేస్తున్నారు’ అని అన్నారు.
అన్నం పెట్టేవారిని అరెస్ట్ చేశారు
‘గత ప్రభుత్వం దుర్మార్గంగా అన్న క్యాంటీన్లను మూసేసింది. భోజనం పెడతామంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇది వారి ఆలోచనా విధానానికి నిదర్శనం. పేదలు కడుపునిండా అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు. అన్న క్యాంటీన్లు మూసివేసేందుకు వారికి మనసెలా వచ్చిందో..? అలాంటి వారు రాష్ట్రాన్ని పాలించారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజా ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లను పున:ప్రారంభించాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయి. ఇటీవల 62 ప్రారంభించాం. ఇంకో 5 క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. గౌరవంగా పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకునేందుకు అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టాం. భువనేశ్వరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒక రోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళాన్ని అందించి స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వం అన్నం పెట్టలేక కాదు… కానీ అన్న క్యాంటిన్లను స్ఫూర్తికి వేదికగా మార్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నాం. ఇది ఒక ప్రజా ఉద్యమంలా మారాలి. అన్న క్యాంటీన్‌లు కూడా పీ4లో భాగమే. పీ`4లో భాగంగా అట్టడుగునున్న 20శాతం మందిని 10 శాతం మార్గదర్శులు ఆదుకోవాలని కోరుతున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
భోజనం ఎలా ఉంటోంది?: సీఎం చంద్రబాబు
పటమట అన్న క్యాంటీన్‌లో అందరితో కలిసి అల్పాహారం తీసుకున్న సీఎం చంద్రబాబు… అక్కడవారిని భోజనం నాణ్యత, రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ రోజూ పరిశుభ్రంగా ఉంటుందా? అని అడగ్గా పరిశుభ్రంగానే ఉంటుందని వారు బదులిచ్చారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలు గురించి చర్చించారు. ఆటో డ్రైవర్ సేవలో, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఇతర సూపర్ సిక్స్ పథకాలపై అభిప్రాయం తెలుసుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు విరాళం అందించారని… సంపాదనలో మీరూ భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం వ్యాఖ్యానించారు. అన్న క్యాంటీన్‌లో అల్పాహారం అనంతరం అక్కడివారితో కలిసి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ఫోటోలు దిగారు.














