- ట్రెండ్‌ను అనుసరించకుండా లక్ష్యంపై దృష్టిపెట్టాలి
- ఏం నేర్చుకున్నారన్నది కాదు.. ఎలా ఆలోచిస్తున్నారన్నదే ముఖ్యం
- షార్ట్‌కట్‌ల ప్రపంచంలో నైతికతే గొప్పబలం
- ఎవరూ చూడనప్పుడు మీరేంచేస్తారో అదే మీ వ్యక్తిత్వం..
- ఏపీ, విశాఖ అభివృద్ధిలో సత్వా గ్రూప్ భాగస్వామ్యం కాబోతోంది
- గ్రీన్ ఉడ్ హై సంస్థ గ్లోబల్ సిటిజన్స్‌ను తయారు చేస్తుండటం గర్వకారణం
- బెంగళూరు గ్రీనఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్‌డే వేడుకల్లో మంత్రి నారా లోకేష్
బెంగళూరు (చైతన్య రథం): యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్‌ను అనుసరించకుండా లక్ష్యంపై దృష్టిపెట్టాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బెంగళూరు సర్జాపూర్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలోని గ్రీనఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ (ఐబీ డిప్లమా ప్రోగ్రామ్) గ్రాడ్యుయేషన్‌డే వేడుకల్లో (2026) మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “ఈ రోజు కేవలం గ్రాడ్యుయేషన్ డే వేడుక మాత్రమే కాదు. జ్ఞాపకాలు కలలను కలిసేచోటు. విద్యార్థులు భవిష్యత్ నాయకులుగా మారే ప్రత్యేకమైన క్షణం. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి పాఠశాల బృందం వచ్చినప్పుడు.. ఈ ఏడాది ‘కొత్త అవకాశాలకు నాంది పలకడం’ అనే థీమ్‌ను విద్యార్థులే ఎంచుకున్నారని చెప్పడం నాకు ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని కలిగించింది. ఇది చాలు మీరేంటో చెప్పడానికి. ఎందుకంటే ఇది కేవలం థీమ్ మాత్రమే కాదు.. ఒక ఆలోచనా విధానం. మీలో ఉన్న ధైర్యాన్ని, జిజ్ఞాసను ప్రతిబింబిస్తోంది. ‘తర్వాత ఏమిటి’ అని అడగడానికి భయపడని తరం, మరీ ముఖ్యంగా ‘ఎందుకు కాదు?’ అని ప్రశ్నించే తరం… నేటి ప్రపంచానికి అవసరమైనది కూడా అదే” అన్నారు.
గ్రీన్ ఉడ్ హై సంస్థ గ్లోబల్ సిటిజన్స్‌ను తయారుచేస్తుండటం గర్వకారణం
“గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్‌వంటి సంస్థలను నిర్మించడంలో సత్వా గ్రూప్ పాత్ర అభినందనీయం. ఈ రోజు సత్వా గ్రూప్ ఏపీ, విశాఖ అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతోంది. అలా ఈ అనుబంధం ప్రారంభమైంది. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఈ క్యాంపస్‌ను, మీ మౌలిక సదుపాయాలను, మీ విజయాలను, మీ ప్రపంచ దృష్టిని చూసినప్పుడు.. గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్‌వంటి సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో గ్లోబల్ సిటిజన్స్‌ను తయారు చేస్తున్నాయని గర్వంగా అనిపిస్తోంది” అని లోకేష్ పేర్కొన్నారు.
ఎలా ఆలోచిస్తున్నారనేదే ముఖ్యం
“ఇక్కడకు రావడంవల్ల నా పాత రోజులు గుర్తుకువస్తున్నాయి. నేను కార్నెగీమెలన్ యూనివర్సిటీలో, తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాను. అవి కలలు, ఆశయాలు, అనిశ్చితితో నిండిన రోజులు. కానీ నేను ఎంతో స్పష్టంగా నేర్చుకున్న ఒక విషయం ఉంది. విద్య అనేది మీరు ఏం నేర్చుకుంటారన్నది మాత్రమే కాదు. మీరు ఎలా ఆలోచించడం నేర్చుకుంటారన్నదే ముఖ్యం. అదే విషయం నాకు ఇక్కడ కూడా కనిపిస్తోంది. పరీక్షల కోసం మాత్రమే కాదు, జీవితానికి సిద్ధం చేసే ఒక విధానం చూస్తున్నాను” అన్నారు.
ట్రెండ్‌ను అనుసరించకుండా లక్ష్యంపై దృష్టిపెట్టాలి
“మీలో ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కావాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికరంగాల వైపు చూస్తున్నారు? ఎంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారు? మీరు ఏ దారిని ఎంచుకున్నా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ట్రెండ్స్‌ను అనుసరించకండి. మీ లక్ష్యాన్ని అనుసరించండి. ఎందుకంటే ట్రెండ్స్ మారిపోతాయి… కానీ లక్ష్యం మాత్రం నిలిచే ఉంటుంది. ఎప్పుడూ ఇతరులు నడవని దారినే ఎంచుకోండి” అని లోకేష్ పిలుపునిచ్చారు.
యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలి
మీరు నన్ను ఈ రోజు ఒక మంత్రిగా చూస్తున్నారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2017-19 వరకు నేను పంచాయతీరాజ్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశాను. ఒక గదిలో కూర్చొని నిర్ణయం తీసుకుంటే.. ఎక్కడో దూరంగా ఉన్న గ్రామంలో, ఎవరో ఒకరి జీవితం మారిపోతుంది. అదే రెస్పాన్స్‌బిలిటీ పవర్. ఒక్కోసారి జీవితం మనల్ని పరీక్షిస్తుంది కూడా. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాను. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గమది. ఆ సవాల్‌ను స్వీకరించా. కానీ ఓడిపోయా. ఆ క్షణం ఎంతో బాధపడ్డా. ఆ ఓటమి నాలో కసి పెంచింది. వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుని ముందుకు సాగాను. 2023లో ఏపీవ్యాప్తంగా 3,132 కిలోమీటర్లకు పైగా యువగళం పేరుతో పాదయాత్ర చేశా. ఏడాదిపాటు గ్రామాలు, పట్టణాలు, పొలాలు, వీధుల్లో నడిచా. రైతులు, మహిళలు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మెకానిక్‌లను కలిశా. ఆ ప్రయాణం నన్ను పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే అప్పటి వరకు పాలనను వ్యవస్థ దృష్టితో చూశా. కానీ ఆ ప్రయాణంలో జీవితాన్ని ప్రజల దృష్టితో చూశా. ఆ రెండు చాలా భిన్నమైనవి. తర్వాత మరో అధ్యాయం ప్రారంభమైంది” అని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు లోకేష్.
మంగళగిరిలో గెలుపు ప్రజల నమ్మకానికి నిదర్శనం
“2024లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచే తిరిగి పోటీ చేశా. అదే మంగళగిరి, అదే ప్రజలు. కానీ ఈసారి మరింత లోతైన అవగాహన, మరింత బలమైన నమ్మకంతో వెళ్లి విజయం సాధించాం. గెలవడమే కాదు… మంగళగిరిలో 91,413 ఓట్ల మెజారిటీ సాధించాం. ఇది రాష్ట్రంలో మూడో అత్యధిక మెజారిటీ. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గంలో ఇది జరిగింది. ఆ విజయం నాది కాదు. ప్రజల నమ్మకానికి నిదర్శనం. వినడానికి చేసిన ప్రయత్నానికి ఫలితం. ప్రజలతో నిజాయితీగా మమేకమైనప్పుడు మార్పు తప్పకుండా వస్తుందని నిరూపించింది” అన్నారు.
షార్ట్‌కట్‌ల ప్రపంచంలో నైతికతే గొప్ప బలం
“కొత్త అవకాశాలకు నాంది పలకడం” అంటే ఎప్పుడూ పూర్తిగా కొత్తదేదైనా సృష్టించడం మాత్రమే కాదు. కొన్నిసార్లు అది ఇతరులు చూడలేని దానిని చూడటం. ఇతరులు పట్టించుకోనప్పుడు వినటం, కూర్చోవడం సులభమైనప్పుడు నిలబడటం. నేను విద్యార్థులకు ఎప్పుడూ ఒక విషయం చెబుతా. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అమ్మకు చెప్పలేని పని జీవితంలో ఎప్పుడూ చేయవద్దని సూచించారు. మీ జీవితంలో ప్రతి నిర్ణయం ఈ పరీక్షను దాటితే.. మీరు ఎప్పుడూ తప్పుదారిలో వెళ్లరు. ఎందుకంటే ఈ షార్ట్‌కట్‌ల ప్రపంచంలో… నైతికతే మీ గొప్ప బలం” అని లోకేష్ ఉద్భోదించారు.
ఎవరూ చూడనప్పుడు మీరేం చేస్తారో అదే మీ వ్యక్తిత్వం
“స్టాన్‌ఫోర్డ్‌లో మేము పరీక్షలు ఇన్విజిలేటర్లు లేకుండానే రాసేవాళ్లం. ఎవరూ గమనించేవారు కాదు. కూర్చొని పరీక్ష రాసి బయటకు వచ్చేవాళ్లం. అప్పుడు నిజాయతీ తప్ప చీటింగ్ చేయకుండా ఎవరూ ఆపలేరు. ఆ విధమైన వ్యవస్థ మా జ్ఞానాన్ని కాకుండా వ్యక్తిత్వాన్ని పరీక్షించింది. ఆ పాఠం నాకు జీవితాంతం గుర్తుండిపోయింది. ఎవరూ చూడనప్పుడు మీరు ఏంచేస్తారో అదే మీ వ్యక్తిత్వం. ఇంకో ఆసక్తికరమైన పద్ధతి కూడా ఉండేది. మాకు ఒక బోర్డు ఉండేది. అందులో విద్యార్థులు తాము ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో బోర్డుపై రాసేవారు. ఉదాహరణకు నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి ఉంటే, అక్కడ రాస్తాను. అప్పుడు ఇంకొకరు వచ్చి మనిద్దరం కలిసి నేర్చుకుందాం అంటారు. అదే కలిసి పనిచేయడంలో, నేర్చుకోవడంలో ఉన్న శక్తి. గ్రీన్‌వుడ్ హైవంటి సంస్థల్లో మీరు నిర్మించుకునే బంధం అదే” అని లోకేష్ పేర్కొన్నారు.
విద్యార్థులు నైతిక విలువలు అలవర్చుకోవాలి
“ఈ రోజు మీరు అడుగుపెడుతున్న ప్రపంచం ఇంతకు ముందెన్నడూ లేనంత వేగంగా మారుతోంది. సాంకేతికత రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగాలు మారుతున్నాయి. పరిశ్రమలే మారిపోతున్నాయి. మీరు భవిష్యత్తులో చేసే కొన్ని ఉద్యోగాలు.. ఈ రోజు ఇంకా లేవు కూడా. అయితే మీకు పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం, కష్టాలను ఎదుర్కొని మళ్లీ నిలబడగలికే ధైర్యం, తెలుసుకోవాలనే ఆసక్తి, నైతిక విలువలు అవసరం. ఎందుకంటే జ్ఞానం మారుతుంది కానీ ఈ విలువలు మాత్రం మారవు” అని హితవు పలికారు.
ప్రపంచపౌరులను తయారు చేసే పాఠశాల ఇది
“ఈ రోజు తల్లిదండ్రుల రోజు కూడా. ప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక త్యాగం, సహనం, నిస్వార్థమైన మద్దతు ఉంటుంది. ఉపాధ్యాయులు భవిష్యత్ నిర్ణేతలు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా జీవితాలను తీర్చిదిద్దుతారు. గ్రీన్‌వుడ్ హై ఒక అద్భుతమైన సంస్థను నిర్మించింది. జ్ఞానం, జీవన నైపుణ్యాలు, మీలాంటి ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రపంచ పౌరులను తయారు చేసే పాఠశాల ఇది. ఈ రోజు డిప్లొమాను అందుకునే విద్యార్థులు.. రేపు మీరు మీ బాధ్యతను అందుకుంటారు. మీ కుటుంబం, సమాజం, దేశంపట్ల బాధ్యతగా ఉండాలి. మీరు ముందుకు సాగే క్రమంలో మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. పెద్ద కలలు కనండి, కానీ నేల మీదే ఉండండి. కష్టపడండి, కానీ నైతిక విలువలను విస్మరించవద్దు. విజయాలు సాధించండి కానీ ఇతరులను కూడా మీతో తీసుకెళ్లండి. ఎందుకంటే నిజమైన విజయం అనేది మీరు ఒంటరిగా సాధించేది కాదు.. ఇతరులకు మీరు సృష్టించే అవకాశమే. 2026 బ్యాచ్ విద్యార్థులు కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే కాదు… మార్గదర్శకులు. అడ్డంకులను ఛేదించి ముందుకు సాగాలి” అని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో సత్వ గ్రూప్ ఎండీ, గ్రీనఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్ బిజయ్ అగర్వాల్, ప్రిన్సిపల్ షీలా అలెగ్జాండర్, వైస్ ప్రిన్సిపల్ నిషాంత్ నగవర్, మేనేజింగ్ ట్రస్టీ నీరు అగర్వాల్, ట్రస్టీ ఎన్.మెహ్రోత్ర, ఐబీడీపీ కోఆర్డినేటర్ ఎస్.కావ్య తదితరులు పాల్గొన్నారు.














