ఆరు నెలల్లో దొమ్మేటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
శెట్టిబలిజ కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేపడతాం
దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభలో మంత్రి లోకేష్
విశాఖపట్నం (చైతన్య రథం): “శెట్టిబలిజల దైవం దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. శెట్టిబలిజల్లో చైతన్యం తీసుకొచ్చి హక్కుల సాధనకు ఉద్యమించారు” అని రాష్ట్ర విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ కొనియాడారు. విశాఖపట్నం తెలుగుదేశం కార్యాలయంలో దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… “శెట్టి బలిజల ఆత్మగౌరవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి జీవితం మనకు ఆదర్శం. బ్రిటిష్ పాలనలో శెట్టిబలిజలు బర్మా వలస వెళ్లారు. వారిలో దొమ్మెటి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. నౌకలను అద్దెకు తీసుకొని షిప్పింగ్ బిజినెస్ చేశారు. సమర్ధవంతంగా వ్యాపారం చేసి నౌకకు ఓనర్ అయ్యారు. తర్వాత బర్మాకు మేయర్‌గా పనిచేశారు. శెట్టిబలిజలు బర్మాలో పడుతున్న బాధలు నేరుగా చూశారు. విద్య విలువ అప్పట్లోనే తెలుసుకొని పిల్లల కోసం స్కూళ్లు పెట్టారు. నైట్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. బర్మాలో శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. అక్కడ ఆర్థికంగా బలపడిన తర్వాత జన్మభూమికి సేవ చేయాలని నిర్ణయించుకుని జన్మభూమికి వచ్చారు. బోడసకుర్రు జమీందార్‌గా అనేక దానధర్మాలు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. స్కూళ్లు, కళాశాలలు ఏర్పాటు కోసం దొమ్మేటి వెంకటరెడ్డి తన సొంత భూమిని దానం చేశారు. లైబ్రరీలు స్టార్ట్ చేయడానికి నిధులిచ్చారు” అని గుర్తు చేసుకున్నారు.
యువగళం హామీని నిలబెట్టుకున్నా
“శెట్టిబలిజల సంక్షేమానికి 2014నుంచి 2019వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. కల్లుగీత ఫెడరేషన్, ఆదాయ పథకం, సబ్సిడీ లోన్లు ఇచ్చాం. కల్లుగీత కార్మికులను ఆదుకున్నాం. 2019-24 నడుమ ఏమి జరిగిందో మీరంతా చూశారు. జె-బ్రాండ్స్‌తో కల్లుగీత కార్మికులను ఆర్థికంగా దెబ్బతీశారు. కల్లుగీత కార్మికులపై అనేక కేసులు పెట్టారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరంతా ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 94శాతం సీట్లతో కూటమి అభ్యర్థులను గెలిపించారు. ఈరోజు కార్యక్రమం యువగళం పాదయాత్రను గుర్తుకుతెచ్చింది. అప్పట్లో ప్రతిరోజు ఒక సామాజిక వర్గాన్ని కలిశాను. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వ పండుగగా చేయాలని ఆనాడు శెట్టిబలిజ సోదరులు నన్ను కోరారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. దొమ్మేటి వెంకటరెడ్డి గొప్పతనం పాదయాత్రలో తెలుసుకున్నా. యువగళం పాదయాత్ర సందర్భంగా 10శాతం మద్యం షాపులు శెట్టిబలిజలకు ఇస్తామని హామీ ఇచ్చా. ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేర్చా” అని పేర్కొన్నారు.
వాళ్ళు వేధించారు… మేం ఆదరిస్తున్నాం
“గతంలో ఆదరణ పథకం కింద శెట్టిబలిజలకు పనిముట్లు అందజేశాం. వైసీపీ ప్రభుత్వం శెట్టిబలిజ సోదరులను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపింది. తన అక్కని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లాడిని కొట్టి పెట్రోలు పోసి తగులబెట్టారు. బీసీ సోదరులపై ఇష్టారాజ్యంగా దాడులు చేశారు. అమర్నాథ్ గౌడ్ కేసులో నిందితుడిని ఊరేగించారు. గత ఐదేళ్లు బీసీ సోదరులను రకరకాలుగా ఇబ్బందిపెట్టారు. వారి నాయకుడికి జై చెప్పలేదని పల్నాడులో తోట చంద్రయ్యను కిరాతకంగా చంపేశారు. వారి బిడ్డకు మేం పదిరోజుల్లో ఉద్యోగం ఇస్తాం. ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు హతమార్చిన నందం సుబ్బయ్య బిడ్డలను, అమర్నాథ్ గౌడ్ సోదరిని మేం చదివిస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆయన స్పీడ్‌ను మేం అందుకోలేక పోతున్నాం. శెట్టిబలిజలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, చెట్టుపైనుంచి పడిన కార్మికులను ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మాది. బోడసకుర్రు బ్రిడ్జికి వెంకటరెడ్డి పేరు పెట్టే విషయమై సీఎంతో మాట్లాడతాం” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఆరునెలల్లో వెంకటరెడ్డి విగ్రహం
ఆర్యవైశ్యుల మాదిరిగానే బోడసకుర్రులో దొమ్మేటి విగ్రహం కలిసికట్టుగా ఏర్పాటు చేస్తాం. ఇందుకు టీడీపీ తరపున, ప్రభుత్వం తరపున సాయం అందిస్తాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగులు విగ్రహం 194 రోజుల్లో పూర్తి చేశారు. అదే స్పూర్తితో ఆరునెలల్లో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు చేయాలి. విగ్రహావిష్కరణకు సీఎం, ఉప ముఖ్యమంత్రి హాజరవుతారని లోకేష్ చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ముతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణ బాబు, బండారు సత్యనారాయణమూర్తి, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రమణ్యం, రెడ్డి అనంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
















