- ముస్లిం వర్గాలకు సీఎం చంద్రబాబు హామీ
- వక్ఫ్ ఆస్తులను కూటమి ప్రభుత్వం కాపాడుతోంది
- ఇమామ్, మౌజన్ల గౌరవవేతన బకాయిలు విడుదల చేస్తాం
- 21 నెలల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు
- విజయవాడ ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): ఇమామ్, మౌజన్లకిచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్‌హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించామన్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… “కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌హౌస్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తాం. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం.
రంజాన్ పండుగను పురస్కరించుకుని పేదలకు దానంచేస్తే సంతోషంగా ఉంటారని మహ్మద్ ప్రవక్త బోధించారు. పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన సూక్తి. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముస్లింలలో 4.38 లక్షలమందికి ఇస్తూ ఏడాదికి రూ.3,511 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షలమంది ముస్లిం విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నాం. 19,215 మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పుల కింద రూ.264 కోట్లు విడుదల చేశాం. దీపం-2.0 పథకం కింద 6.2 లక్షల కుటుంబాలకు రూ.158 కోట్లతో సిలిండర్లకు ఖర్చు చేస్తున్నాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనంగా రూ.180 కోట్లు అందించాం. మరో రూ.45 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ముస్లింల మనోభావాలను కూటమి గౌరవిస్తుంది
“అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నాం. వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్లనుంచి 10 ఏళ్లకు పెంచాం. 347మంది ముస్లింలు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌నుంచి హజ్‌యాత్రకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నాం. 33,275 మందికి ఆర్ధిక చేయూత కింద రూ.193 కోట్లు ఇచ్చాం. యువతకు నైపుణ్యాలు అందించి మెరుగైన ఉపాధి ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నాం. గత పాలకులు జీవో 47 ద్వారా వక్ఫ్ బోర్డును వివాదాల్లోకి నెట్టారు. ఆ జీవోను రద్దు చేసి వక్ఫ్ బోర్డును పునర్వవ్యస్తీకరించాం. 1500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేశాం. వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నాం. నూర్ బాషా ఫెడరేషన్ పేరును దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషనుగా మార్పు చేసి రూ.100 కోట్లు కేటాయించాం. గత బడ్జెట్లో మైనారిటీలకు రూ.5,434 కోట్లు కేటాయిస్తే… ఈసారి రూ.6,090 కోట్లు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి గత పాలకులు రూ.లక్ష మాత్రమే ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో రూ.7 కోట్లు మంజూరు చేశాం.
అబ్దుల్ హక్ అవార్డు కింద రూ.లక్షనుంచి రూ.1.25 లక్షలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఉర్దూ ఘర్, షాదీ ఖానాల నిర్మాణానికి రూ.2.85 కోట్లు కేటాయించాం. ముస్లిం జీవన ప్రమాణాలు పెంచేలా చేస్తున్నాం. అన్ని మతాలను గౌరవిస్తా. అందరివాడిలా ఉంటా. పేదలను ఆదుకునేందుకు పీ`4 తీసుకొచ్చాం. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ మంత్రి ఎనఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు.















