- మంత్రి లోకేష్ ఎదుట నిర్మాణ ప్రణాళిక
- కోర్సులనూ వివరించిన బిట్స్ పిలానీ బృందం
- క్యాంపస్‌ను త్వరగా ప్రారంభించాలన్న మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్ చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్‌ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ… ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్‌లో ఉంటాయని తెలిపారు. “రెండు దశల్లో 7వేలమంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నాం. ఈ క్యాంపస్‌పై వచ్చే ఐదేళ్లలో వెయ్యికోట్ల పెట్టుబడి పెడతాం” అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నాం. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యూవబుల్ ఎనర్జీవంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నాం. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌గా ఉండబోతోంది. అధునాతన సాంకేతికలతోపాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణవంటి కోర్సులు కూడా ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు బిట్స్ ప్రతినిధులు తెలిపారు. బిట్స్ నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సంతృప్తి వ్యక్తంచేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.














