- నిజాయితీ, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లోకేష్ ప్రశంస
తిరుపతి (చైతన్య రథం): నీతి నిజాయితీలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బంగారం అంటూ విద్యామంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. తిరుపతి సంఘటనపై సమాచారం అందుకున్న మంత్రి లోకేష్.. దానిపై ఎక్స్‌లో పోస్టు పెట్టారు. “తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ బాలికల హైస్కూలులో చదువుతున్న మా పిల్లలు బంగారం అని నిరూపించుకున్నారు. గురువారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తరువాత.. వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకువద్ద మన్నవరం బస్సుకోసం నిరీక్షిస్తున్న కొత్తపల్లిగుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి గురుప్రియ, బి గీతిక, ఎం గీతిక, 6వ తరగతి చదువుతున్న పద్మశ్రీ, 7వ తరగతి విద్యార్థిని హేమలతలకు రోడ్డుపై పర్సు కనిపించింది. తీసి చూస్తే బంగారం, నగదు. రెండో ఆలోచన లేకుండా అమ్మాయిలంతా పోలీస్ స్టేషన్‌వైపు నడిచారు. ఎసఐ స్వరూపకు తమకు దొరికిన పర్సు అందజేసి, అభినందనలు అందుకుని ఇంటికెళ్లేందుకు మళ్లీ బస్టాప్‌వద్దకు వచ్చారు. అక్కడ ఓ మహిళ పర్సుకోసం వెతుకుతూ పిల్లల్ని అడిగింది. తమకే దొరికిందని.. స్టేషన్‌లో ఇచ్చామని చెబుతూ ఆమెతోపాటు స్టేషన్‌కు వెళ్లారు పిల్లలు. నగలు, నగదు ఆమెవేనని నిర్ధారించుకున్న ఎసఐ మహిళకు వాటిని అందజేశారు. చిన్న వయస్సులో మీ నీతివంతమైన ప్రవర్తన ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలూ! మీకు ఎల్లప్పుడూ అండగా ఉండే అన్నగా నేను గర్విస్తున్నాను. మీ నిజాయితీ మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. హృదయపూర్వక అభినందనలు చిట్టితల్లులూ..” అంటూ మంత్రి లోకేష్ భావోద్వేగం, అవ్యాజమైన ప్రేమను పోస్టులో చూపించారు.













