- ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలో 2.0 ప్రారంభిస్తాం
- అసెంబ్లీలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): “ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48 కోట్ల సేవలు అందించాం. వాట్సాప్ సర్సీసులపై వినియోగదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ఈ యాప్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నట్టు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మనమిత్ర వాట్సాప్ సేవలపై శాసనసభలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ… వాట్సాప్ సేవలవల్ల సమయం ఆదా అవుతోంది. ఎటువంటి ఫీజు లేకుండా సేవలందించడం హర్షణీయం. అయితే యాప్ బాగా స్లోగా ఉండటంవల్ల అందరూ ఉపయోగించుకోలేక పోతున్నారు. ఇతర యాప్‌ల మాదిరి ఒకసారి వివరాలు నమోదుచేశాక మళ్లీ చేసే అవసరం లేకుండా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఉపయోగించుకునేలా మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దాలని కోరారు. మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… మనమిత్ర ప్లాట్ ఫాంపై మేం ఎలాంటి డేటా స్టోర్ చేయడం లేదు.
వాట్సాప్ అనేది ఒక హైవే. డేటా డిపార్ట్‌మెంట్ వద్ద ఉంటుంది. దీనివల్ల ప్రతిసారీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రాసెస్‌ను డిజిటలైజ్ మాత్రమే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని సేవలు సెల్ ఫోన్‌లో ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఇంటి ముంగిటకు వస్తున్నాయి. అదే బటన్ ద్వారా ప్రజలకు అవసరమైన పౌరసేవలు, సర్టిఫికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన నాకు యువగళం పాదయాత్ర సమయంలో వచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సింగిల్ ఫోన్ నెంబర్ ద్వారా పెద్దఎత్తున వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచాలి. వెనువెంటనే రిసీట్ రావాలి. క్యూఆర్ కోడ్ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. సభ్యులు మినమిత్ర యాప్‌కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. 90రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొని మనమిత్ర 2.0 ప్రారంభిస్తాం. దీనిపై డోర్ టు డోర్ టు క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ కోరారు.














