- వైసీపీ సభ్యులు ఎందుకు పారిపోతున్నారు
- మార్చి 4న మేము చర్చకు సిద్ధం..
- వాస్తవాలు ప్రజలకు చెప్పాలనేదే ఉద్దేశం
- మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల
అమరావతి(చైతన్యరథం): కల్తీ నెయ్యిపై చర్చకు వైకాపా సభ్యు లు ఎందుకు భయపడుతున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. కల్తీ నెయ్యి అంశంపై శాసన మండలిలో గురువారం గందరగోళం నెలకొంది. చర్చకు ప్రతిపక్షానికి ముందుగా అవకా శం ఇస్తామని మండలి చైర్మన్ మోషేనురాజు చెప్పారు. దీనికి పయ్యావుల స్పందిస్తూ స్టేట్‌మెంట్ ఇస్తామని మేము ముందే చెప్పాం..లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత సమయ మైనా చర్చకు అనుమతించండి. అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగిం చినా మాకు ఇబ్బంది లేదు. వినేందుకు కూడా ఓపిక లేనప్పుడు ప్రశ్నలు ఎందుకు అడగాలి. కల్తీ నెయ్యిపై చర్చకు వైకాపా సభ్యు లు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సభ్యుల నినాదాల మధ్యే సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
మార్చి 4న లఘు చర్చకు సిద్ధం: పయ్యావుల
రాష్ట్ర శాసన మండలిలో మార్చి 4న తిరుపతి లడ్డు అంశంపై లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా సభ్యులకు చర్చపై ఎలాంటి ఆసక్తి లేదు. చర్చ చేపట్టాలని శాసనసభకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ప్రభుత్వం ముందుకు వచ్చి వైకాపా సభ్యుల నోటీసుపై చర్చ చేపట్టింది. బీఏసీలో వైకాపా లేవనెత్తిన అంశాల పైనే చర్చ పెడతామని చెప్పాం. శాంతిభద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, తిరుమల లడ్డుపై చర్చకు సిద్ధమయ్యాం. శాసన సభలో ప్రతిపక్షం లేకపోయినా బీఏసీలో లేవనెత్తిన అంశాలపై చర్చించాం. తిరుమల లడ్డూ అంశంపై వాస్తవాలు ప్రజలకు చెప్పా లనేది మా ఉద్దేశం. లడ్డూ అంశంపై స్వల్పకాలిక చర్చకు అవకా శం ఇవ్వాలని దూళిపాళ్ల లేఖ రాశారు. ప్రతిపక్షం లేకపోయినా సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తున్నాం. తిరుమల లడ్డూ అంశంపై వైకాపా ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. వైకాపా సభ్యులకు అల్లరి కావాలి.. అందుకే సభలో చర్చ జరగలేదని దుష్ప్రచారం చేస్తున్నారు” అని మీడియా పాయింట్ వద్ద మంత్రి పయ్యావుల తెలిపారు. ప్రభుత్వం ముందుకు వచ్చి స్టేట్‌మెంట్ ఇస్తున్నామని చెప్పినా..వారు ఎందుకు పారిపోతున్నారని దెప్పిపొడిచారు. వైసీపీ వాకౌట్..టాకౌట్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.













