- ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
- ఏపీకి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ ఉంది..
- విశ్వసనీయ కంపెనీలకే రూ.99 పైసలకు భూ కేటాయింపులు
- ఐదు కంపెనీల ద్వారా 65వేల మందికి ఉద్యోగాల కల్పన
- భూ కేటాయింపుల్లో లాలూచీ పడాల్సిన అవసరం లేదు
- విమర్శించాలనుకుంటే కప్ టీ గురించి నన్ను విమర్శించండి
- అంతకుమించి ఎక్కువ తీసుకునివుంటే నిరూపించాలి
- అప్పుడు ఎలాంటి చర్యలకైనా నేను సిద్ధం
- వైసీపీకి ధీటైన సమాధానమిచ్చిన మంత్రి నారా లోకేష్
- ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో వాడీ వేడి చర్చ
- మండలి నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్
అమరావతి (చైతన్య రథం): “యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. ఏపీకి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ ఉంది. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే రూ.99 పైసలకు భూములు కేటాయించాం. ఐదు కంపెనీల ద్వారా 65వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. భూముల కేటాయింపుల్లో మేం ఎక్కడా లాలూచీ పడాల్సిన అవసరం లేదు. విమర్శించాలనుకుంటే కప్ టీ గురించి విమర్శించవచ్చు. ఒక కప్పు కాఫీకంటే నేను వారివద్ద ఏం తీసుకున్నట్టు అనిపించినా నిరూపించాలి. అప్పుడు ఏ చర్యకైనా సిద్ధం” అని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. పరిశ్రమలకు 99 పైసలకే భూ కేటాయింపులపై ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. వైసీపీ సభ్యుల ఆరోపణలకు మంత్రి ధీటుగా సమాధానమిచ్చారు. గత 20 నెలల కాలంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు 99 పైసలకు కేటాయించిన భూముల వివరాలు, కుదుర్చుకున్న ఎంవోయీలు, పరిశ్రమల వారీగా భూముల కేటాయింపులు, ధరల వివరాలపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు తూమాటి మాధవరావు, వరుదు కల్యాణి, డా.పండుల రవీంద్రబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో 5 కంపెనీలకు 99 పైసలకు భూమి కేటాయించాం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, ఏఎనఎసఆర్ గ్లోబల్, రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూములు కేటాయించాం. ఏయే కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పించనుందో కూడా ప్రభుత్వ సమాధానంలో పొందుపర్చాం. కాగ్నిజెంట్‌కు భూమి కేటాయించినప్పుడు 8వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కానీ భూమిపూజ సమయంలో 25వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎనఐ, ఐటీ అండ్ కామర్స్, ఏపీసీఆర్డీయే, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, టెక్స్ టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ పాలసీల కింద ఆయా సంస్థలకు భూములు కేటాయించడం జరిగింది. ఐదు కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు కేటాయించాం” అని మంత్రి పునరుద్ఘాటించారు.
పరిశ్రమలకు భూ కేటాయింపుపై వాడీ వేడి చర్చ
విశాఖలో కోట్లాది రూపాయల విలువైన భూములను 99 పైసలకే ప్రైవేటు సంస్థలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎలా కేటాయిస్తారంటూ వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ సభ్యులు మాధవరావు, వరుదు కల్యాణి ప్రశ్నించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ధీటుగా సమాధానమిస్తూ.. “హైదరాబాద్‌లో రహేజా మైండ్ స్పేస్‌కు ఆనాడు 97 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. వారు 21 బిల్డింగ్‌ల ద్వారా 10వేల మిలియన్ స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేశారు. నేడు ఒక్క మైండ్ స్పేస్‌లోనే ఐటీ రంగంలో లక్షమంది పనిచేస్తున్నారు. అనేక ప్రముఖ కంపెనీలు అక్కడ కొలువుదీరాయి. రహేజా, ఏఎనఎసఆర్ సంస్థలు జీసీసీలకు అవసరమైన భవనాలు నిర్మించి అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తారు. వారికి పారదర్శకంగా భూములు కేటాయించాం. బెంగళూరులో ఏఎనఎసఆర్ సంస్థ నిర్మించిన జీసీసీ సెంటర్‌ను నేను స్వయంగా చూశా. ఈ ఒక్క కంపెనీ 150 జీసీసీలను నిర్మించింది. సుమారు లక్షా 40వేల మంది ఆయా జీసీసీల్లో పనిచేస్తున్నారు. భూముల కేటాయింపు విషయంలో ప్రతి కంపెనీని అధికారుల కమిటీ, ఎసఐపీబీ, మంత్రుల సంఘం క్షుణ్ణంగా సమీక్షించడం జరుగుతుంది. అనంతరం కేబినెట్ ఆమోదంతో భూములను కేటాయిస్తున్నాం” అని సమాధానమిచ్చారు.
క్రెడిబులిటీ ఉన్న కంపెనీలకే భూ కేటాయింపు
“గతంలో 99 పైసలకే వేరే కంపెనీకి భూమి ఇచ్చినట్టు ఆరోపించారు. నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేస్తే పారిపోయారు. క్రెడిబులిటీ ఉన్న కంపెనీలకే 99 పైసలకు భూములు ఇస్తున్నాం తప్ప.. ఆయారాం గయారాం కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధంగా లేం. అంతకుముందు వైసీపీ సభ్యుల తీరును మంత్రి అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై చర్చకు సిద్ధమని, ప్రశ్నోత్తరాలు గంటలోనే ముగించాలని నిర్ణయం తీసుకున్నందున బీఏసీలో చర్చించి ఈ అంశంపై లఘు చర్చ చేపట్టాలని చెప్పారు. ప్రశ్నకు సంబంధం లేనివి అడగడంవల్ల సమయం వృధా అవుతోందన్నారు.
వైసీపీ పిల్‌పై కోర్టు మొట్టికాయలు
మంత్రి లోకేష్ సమాధానంపట్ల వైసీపీ సభ్యులు అభ్యంతరం లేవనెత్తారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. “టీసీఎస్, కాగ్నిజెంట్, మదర్సన్, రహేజా, ఏఎనఎసఆర్ సంస్థలకు భూములు ఇవ్వకూడదా అని ప్రశ్నించారు. భూముల కేటాయింపుపై వైసీపీనే కోర్టులో పిల్ వేయించారని, కోర్టు కూడా మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. విశాఖలో రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే 27.1 ఎకరాలను ఎలా కేటాయిస్తారని వైసీపీ సభ్యులు మాధవరావు, వరుదు కల్యాణి ప్రశ్నించారు. అడ్రస్‌లేని ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూములు కట్టబెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ సభ్యుల ఆరోపణలను మంత్రి లోకేష్ ధీటుగా తిప్పికొట్టారు. తాము 5 కంపెనీలకే 99 పైసలకు భూములు కేటాయించామని, ఆరో కంపెనీ పేరు ప్రస్తావించినందున ఆధారాలు బయట పెట్టాలని, ఆరోపణలు చేసి బయటకు వెళ్లడం కాదని సవాల్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రకటనను ఉపసంహరించుకోవాలని మంత్రి లోకేష్ పట్టుబట్టారు. ఉర్సాకు తాము ఎలాంటి భూములు కేటాయించలేదని మరోసారి స్పష్టం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే పరిశ్రమలకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నామని చెప్పారు. ఉర్సా విషయంలో వైసీపీ సభ్యుల ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు.
లెక్కల్లోకి వెళితే 151కాస్తా 11 అయ్యాయి
వైసీపీ సభ్యుల అరుపులు నేపథ్యంలో మంత్రి లోకేష్ జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు వినేందుకు ఓపిక పడితే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. వైసీపీ సభ్యులు ఎందుకు అరుస్తున్నారు. సమాధానం చెప్పాలా, వద్దా? నేడు దేశానికి వస్తున్న రూ.100 పెట్టుబడుల్లో 25.3 రూపాయలు ఏపీకి వస్తున్నాయన్నారు. వైసీపీ సభ్యులు అరుపులపై స్పందిస్తూ.. లెక్కల్లోకి వెళితే 151 కాస్తా 11 అయ్యాయి. టీం 11 తయారైంది. దీనిపైనా చర్చిద్దామా? 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో చూశాం. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచింది. అమర్ రాజాను రాష్ట్రంనుంచి తరిమేశారు. ఆర్సెల్లార్ మిట్టల్ ఎక్కడికీ వెళ్లలేదు. వైసీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఆర్సెల్లార్ మిట్టల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది. మేం భూములు కేటాయించాం. పర్యావరణ అనుమతులు వచ్చాయి. 17 నెలల్లోనే మేం వారిని రాష్ట్రానికి తీసుకువచ్చాం. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాబోతోంది. విశాఖలోనే రెండో స్టీల్ ప్లాంట్‌ను నిర్మించబోతున్నాం. వైసీపీ సభ్యులు ఎందుకు కంగారు పడుతున్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాం. మాధవరావుకి కొంచెం బీపీ ఎక్కువైంది. బీపీ బిళ్లలు ఇవ్వండి. అప్పుడే కామ్‌గా ఉంటారు” అంటూ మంత్రి లోకేష్ హూందాగా చమత్కరించారు.
ఏపీకి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ ఉంది
“ఏపీకి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ ఉంది. పరిశ్రమలను తరిమేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టీసీఎస్‌కు భూమి ఇవ్వడం తప్పా? అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా భూములు కేటాయిస్తున్నాం. పక్క రాష్ట్రాలతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. విశాఖలో ఐటీ ఎకో సిస్టమ్ లేదు. ఇది నిజం. వైసీపీ ఐదేళ్లకాలంలో విశాఖకు ఒక్క పరిశ్రమ కూడా తేలేదు. మేం 18 నెలల్లోనే అనేక పరిశ్రమలను విశాఖకు తీసుకువచ్చాం. విశాఖలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్నాం. ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 1994-2004 మధ్య చంద్రబాబు అతి తక్కువ ధరకు ఆనాడు హైదరాబాద్‌లో భూములు కేటాయించారు. అందుకే ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ హైదరాబాద్‌లో ఉన్నాయి. నేడు హైదరాబాద్ జీసీసీ కేపిటల్ అయ్యిందంటే దానికి కారణం ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం వల్లే”నని మంత్రి లోకేష్ విస్పష్టంగా చెప్పారు.
యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యం మాది
“ఏపీఐఐసీని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు భూములు కేటాయిస్తున్నారన్న వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. “ఆనాడు పశ్చిమ బెంగాల్‌లో టాటా నానో ఫ్యాక్టరీని తరిమేశారు. దీంతో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 99 పైసలకే భూమి ఇస్తామని ఆఫర్ చేయడంతో ఆ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. దీంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడింది. దానిని ఆదర్శంగా తీసుకుని విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. ఏపీఐఐసీ ఎప్పుడూ ఐటీ భవనాలు నిర్మించలేదు. మిలీనియం టవర్స్ ఒక్కటే నిర్మించారు. ఆ భవనాన్ని ఇప్పటికే లీజ్‌కు ఇవ్వడం జరిగింది. లీజ్‌వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. అందుకే భూమిని అభివృద్ధికి ఇవ్వాలని పాలసీగా పెట్టుకున్నాం. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి రెండు రూపాయలు ఆదాయం తగ్గినా ఫర్వాలేదు. ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు మేం కల్పిస్తాం. ఇది మా విధానం. ఆదాయం ఎక్కువ కావాలనుకుంటే అది మీ పాలసీ. ఉద్యోగాల కల్పన అనేది మా ప్రభుత్వ పాలసీ. 175 నియోజరవర్గాల్లో ఎంఎసఎంఈ పార్క్‌లను అభివృద్ధి చేస్తాం. ప్రైవేట్ పార్క్‌లను కూడా ప్రోత్సహిస్తాం. సత్వా గ్రూప్ విషయానికి వస్తే.. ఒక్కసారి హైదరాబాద్ వెళ్లి చూడాలి. ఇవన్నీ క్రెడిబులిటీ ఉన్న కంపెనీలు. ఐదారు రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నారు. గ్రేడ్-ఏ ఐటీ ఆఫీస్ కార్యాలయాలు నిర్మిస్తారు. దీంతో ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. అప్పుడే జీసీసీలు వస్తాయి. విశాఖలో గ్రేడ్-ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు” అని లోకేష్ వివరించారు.
విశ్వసనీయత ఉంటేనే.. భూకేటాయింపులు
“మొదట దావోస్ సమావేశంలో నేను కాగ్నిజెంట్ సీఈవో రవిని కలిసినప్పుడు 99 పైసలకే భూమి ఇస్తానని కమిట్ అయ్యాను. ఇది నా టెక్నిక్. మొన్నటి దావోస్‌కు వెళ్లినప్పుడు విశాఖలో ఎకో సిస్టమ్ అభివృద్ధిపై అడిగారు. ఐటీ కంపెనీలను తీసుకురావడమే కాదు, మొత్తం ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తేనే ఇవి సస్టైన్ అవుతాయి. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే రూ.99 పైసలకు భూములు కేటాయించాం. మరిన్ని కంపెనీలను తీసుకువస్తాం. ఇప్పటికే ఐదేళ్లు నష్టపోయాం. 18 నెలల్లో ఎవరూ ఊహించని విధంగా పెద్దపెద్ద కంపెనీలను తీసుకువచ్చాం. 99 పైసలకే భూములు కేటాయించిన ఐదు కంపెనీలు 65వేలమందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాయి. విశాఖలో ఒక్క ఐటీ రంగం ద్వారా 2029నాటికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవన్నీ వైసీపీకి నచ్చకపోవచ్చు” అని లోకేష్ ఎద్దేవా చేశారు.
విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన లక్ష్యం
భూ కేటాయింపుల్లో పారదర్శకత లేదని, విశాఖలో వారి కుటుంబానికి ఏవిధంగా భూములు కేటాయిస్తారంటూ విపక్ష నేత బొత్స ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా సభనుంచి వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. ఐదు కంపెనీలకు మాత్రమే మేం 99 పైసలకు భూములు కేటాయించాం. ఉర్సాకు భూముల కేటాయింపై ఛాలెంజ్ చేస్తే సమాధానం చెప్పలేదు. ఇంకొకరికి ఎవరికో భూమి ఇచ్చారన్నారు. అసలు కేటాయింపే జరగలేదు. వాకౌట్ చేస్తారు. విపక్ష నేతలు సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క ఐటీ ఉద్యోగంవల్ల ఐదారుగురికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 65వేల ఐటీ ఉద్యోగాలవల్ల సుమారు మూడున్నరనుంచి నాలుగున్నర లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 50వేల ఐటీ ఉద్యోగాలు రావడంవల్ల సిటీలో డైరెక్ట్‌గా సుమారు బిలియన్ డాలర్లు ప్రతి ఏడాది ఎకానమీ వస్తుంది. మా లక్ష్యం 5 లక్షల ఐటీ ఉద్యోగాలు. తద్వారా 10 బిలియన్ డాలర్ల మేర ఎకనామిక్ యాక్టివిటీస్ విశాఖలో జరగాలనేది లక్ష్యం” అని పేర్కొన్నారు.
కప్ టీ గురించి నన్ను విమర్శించవచ్చు
“వైసీపీ సభ్యులు ఎందుకు వాకౌట్ చేశారో అర్థం కాలేదు. బొత్సకు అదొక ఫ్యాషన్. ఈ తలుపు నుంచి వచ్చి ఆ తలుపునుంచి వెళతారు. మేం చాలా పారదర్శకంగా భూ కేటాయింపులు చేశాం. వారి దగ్గరనుంచి ఏం తీసుకున్నారని ఆరోపించారు. నన్ను విమర్శించాలనుకుంటే ఒక్క విషయంలో విమర్శించవచ్చు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్ర ఒకసారి కలవాలని అడిగారు. నేను బాంబే హౌస్‌కు వెళ్లాను. బాంబే హౌస్‌లో కప్ టీ ఇచ్చారు. నన్ను విమర్శించాలనుకంటే కప్ టీ గురించి విమర్శించవచ్చు. నో ప్రాబ్లమ్. కాగ్నిజెంట్ విషయంలో కూడా నన్ను విమర్శించవచ్చు. వాళ్లు నాకు ఓ కప్ కేక్ ఇచ్చారు. దావోస్‌లో వారి ఆఫీసుకు వెళ్లినప్పుడు ఆ రోజు నా పుట్టినరోజు. వారు మర్యాదపూర్వకంగా కప్ కేక్‌లో క్యాండిప్ పెట్టి నాతో బ్లో చేయించారు. సింపుల్. అంతేగానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. మేం ఎక్కడా లాలూచీ పడాల్సిన అవసరం లేదు. ఒక్క కియా పరిశ్రమ వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారాయి. క్లస్టర్ విధానంలో మేం ముందుకు వెళ్తున్నాం. మేం ప్రతి పరిశ్రమను గ్రౌండింగ్ చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక కప్పు కాఫీ కంటే నేను వారి వద్ద ఎక్కువ తీసుకుని ఉంటే నిరూపించాలి. అప్పుడు ఏ చర్యకైనా నేను సిద్ధం” అని మంత్రి లోకేష్ ఛాలెంజ్ చేశార. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని మంత్రి ఎద్దేవా చేశారు.













