- కలిసికట్టుగా పనిచేద్దాం.. అభివృద్ధి చేసుకుందాం
- పరీక్షలు పెట్టే దేవుడు.. జయించే శక్తీ ఇస్తాడు
- ఏ పనిచేసినా సంకల్పం, పట్టుదల ముఖ్యం
- కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా నిలుద్దాం
- లూథరన్ చర్చి ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్
మంగళగిరి(చైతన్యరథం): అందరం కలిసికట్టుగా పనిచేస్తే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి రూపుదిద్దుకుం టుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం ఆత్మకూరులో ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘం, ఆత్మకూరు ప్యారిష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చి ప్రతిష్ఠ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి నూతన చర్చిని ప్రారంభించారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా మన మందిరాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. ఈ మందిరం పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం దేవుడు కల్పిం చాడు. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా, చర్చికి వచ్చినా, దేవాలయానికి వచ్చినా ఒక్కటే చెబుతాను. దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకు ఇస్తాడు. కష్టాల్లో ఉన్న మన తోటివారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సమాజాన్ని చూస్తే.. చిన్న, చిన్న విష యాలకే ఆందోళన చెందుతున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
దేవుడు పరీక్ష పెడితే.. సంకల్పంతో జయించాలి. 2019లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాను. అయినా నేను భయపడలేదు. కసితో పని చేసి ప్రజలకు దగ్గరయ్యాను. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, నియోజక వర్గాన్ని దేవుడి ఆశీస్సులతో దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. మంగళ గిరిని కలిసిక ట్టుగా అభివృద్ధి చేసుకుందాం. కులాలు వేరైనా, మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని, కష్టాలను కలిసిక ట్టుగా ఎదుర్కొందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి, రెవరెండ్ డాక్టర్ కొడాలి విజయ్, కేరళ రిటైర్డ్ సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి, ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్ పి.యస్ జోసఫ్, ఏఈఎల్సీ మాజీ మధ్యమ గుంటూరు సినడ్ బిషప్, రైట్. రెవరెండ్ డాక్టర్ ఎస్.జే. బాబూరావు, రెవరెండ్ జే. ఏసురత్నంతో పాటు సంఘ పెద్దలు, పాస్టర్లు, పెద్దఎత్తున క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. అనంతరం అందరితో కలిసి ఫొటోలు దిగారు.














