- బడుగుల అభ్యున్నతికి బ్యాంకర్లు చేయూత ఇవ్వాలి
- రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల రుణాల రీ-షెడ్యూల్
- 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే లక్ష్యం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి బాట పట్టాలంటే ఎంఎస్ఎంఈలను ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈలు ఎదిగేలా… మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల (ఎస్ఎల్డీసీ) సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. దావోస్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి శుక్రవారమే ఏపీకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆయన నేరుగా ఎస్ఎల్బీసీ సమావేశానికి హాజరయ్యారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్షించారు. అలాగే ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రుణాల అమలుపై సమీక్షించారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలను ఇచ్చినట్టు బ్యాంకర్లు వెల్లడించారు. కౌలు రైతులకు రూ.1490 కోట్ల మేర వ్యవసాయ రుణాలు అందజేసినట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఈలకు రూ. 95,714 కోట్ల మేర రుణాలు జారీ చేసినట్లు బ్యాంకర్లు చెప్పారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…ప్రజలకు భరోసా ఇచ్చేలా పాలన ఉండాలన్నారు. గత పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయి. ఎక్కువ వడ్డీలకు పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు. క్రెడిబిలిటీ ఉంటే తక్కువ వడ్డీలకే రుణాలు తెచ్చుకోవచ్చు. అందుకే క్రెడిబిలిటీకి, బ్రాండింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏపీలో రూ.2 లక్షల కోట్ల మేర రుణాలను రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశాం. ఇప్పటి వరకు రూ.49 వేల కోట్ల మేర రుణాల రీ షెడ్యూల్ చేశాం. రుణాల రీ-షెడ్యూల్ వల్ల రూ.1108 కోట్ల మేర ఆదా చేసుకోగలుగుతున్నాం. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం కోరుతున్నాం. ఎంఎస్ఎంఈలకు, అలాగే వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం కావాలి. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూత ఇచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తే ప్రాథమిక రంగంతోపాటు… పారిశ్రామిక రంగం, సర్వీస్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి. అప్పుడే అన్ని రంగాల్లో బడుగులూ ఎదుగుతారు, 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే లక్ష్యం. వారి కోసం ప్రభుత్వాలుగా మేం చేయాల్సింది చేస్తున్నాం. బ్యాంకర్ల వైపు నుంచి సహకారం ఉండాల్సిందే. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. పేద-ధనికుల మధ్య తారతమ్యాలు పోవాలని ముఖ్యమంత్రి అన్నారు.
డ్వాక్రా సంఘాల తరహాలోనే రైతులకు ప్రోత్సాహం
పీపీపీ ప్రాజెక్టులకు వీజీఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంతో ముందుకెళుతున్నాం. సర్వీస్ సెక్టార్ పుంజుకునేందుకు అనువుగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలి. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంపై దృష్టి సారించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయనే విషయాన్ని బ్యాంకర్లు గుర్తించాలి. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నాం. బ్యాంకులు సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు ఇటీవలే శంకుస్థాపన చేశాం. నిర్మాణాలు మరింత ఊపందుకుని త్వరితగతిన పూర్తి కావాలి. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయాలి. టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లకు ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకుంటాం.
సమస్య పరిష్కారానికి మా వైపు నుంచి ప్రయత్నిస్తున్నాం… బ్యాంకర్లు కూడా సహకరించాలి. డ్వాక్రా గ్రూపు బ్యాంక్ ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారు. బ్యాంకర్లు ఈ ఛార్జీలను తగ్గించాలి. భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. గత ప్రభుత్వం 22ఏ పేరుతో భూ వివాదాలు సృష్టించింది. ఇప్పుడు భూ రికార్డులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఇస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. బ్యాంకర్లు కూడా బ్యాంక్ ఖాతాల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశ పెట్టే అంశంపై ఆలోచన చేయాలి. ఇకపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు.
స్టార్టవ్లకు బ్యాంకర్ల సహకారం
ఈ సమావేశంలో స్టార్టప్ కంపెనీలకు చేయూత ఇచ్చే అంశం మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకుల నుంచి మద్దతు ఇస్తున్నట్టు సీఎం దృష్టికి బ్యాంకర్లు తీసుకొచ్చారు. అమరావతి లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయానికి యూనియన్ బ్యాంక్ సపోర్ట్ చేస్తోందని వెల్లడించారు.
రాజమండ్రి స్పోక్ హబ్క ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, అనంతపురం స్పోక్ హద్కు కెనరా బ్యాంక్, విశాఖ స్పోక్ హబ్్కు పంజాబ్ నేషనల్ బ్యాంక్, తిరుపతి స్పోక్ హబ్్కు ఇండియన్ బ్యాంక్, విజయవాడ స్పోక్ హబ్క హెల్దీఎఫ్సీ బ్యాంకులు సహకారం ఇస్తున్నట్టు ఆయా బ్యాంకర్ల ప్రతినిధులు చెప్పారు. ఇక లీడ్ బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ రతన్ టాటా ఇన్నోవేషన్ హద్కు తన సీఎస్సార్ నిధుల నుంచి రూ.10 కోట్లు విరాళం ఇచ్చింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి మంత్రులు వయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సీఎస్ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం, వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు హాజరయ్యారు.















