- కూటమి ప్రభుత్వ సరికొత్త చరిత్ర
- తొలిసారిగా 40.109 టీఎంసీల నీటి తరలింపు
- కేవలం 190 రోజుల్లో ప్రాజెక్ట్ డిజైన్డ్ కెపాసిటీని మించి నీటి తరలింపు
- సీమను సస్యశ్యామలం చేసినందుకు సీఎంకు ఆ ప్రాంత మంత్రుల కృతజ్ఞతలు
- హంద్రీ-నీవా నుంచి 50 టీఎంసీల వరకు నీటిని తరలించి మరో రికార్డ్ సృష్టించాలని ముఖ్యమంత్రి ఆదేశం
అమరావతి (చైతన్యరథం): హంద్రీ-నీవా ప్రాజెక్టునుంచి రికార్డ్ స్థాయిలో నీటిని సీమ జిల్లాలకు తరలించి ఏపీ జలవనరుల శాఖ రికార్డ్ సృష్టించింది. హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని ఇరిగేషన్ అధికారులు తరలించారు. ప్రాజెక్ట్ డిజైన్డ్ కెపాసిటీని మించి ఈ స్థాయిలో నీటిని తరలించడం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో నీటిని తరలించడమే కాకుండా… కేవలం 190 రోజుల్లోనే ఈ స్థాయిలో నీటిని ఇరిగేషన్ అధికారులు రాయలసీమకు తరలించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినప్పటి నుంచి ఈ స్థాయిలో నీటి తరలింపు తొలిసారిగా జరగడంతో సీమ జిల్లాల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం సీమ రైతులు నీటిని అందుకోగలగడానికి కారణం టీడీపీ, కూటమి – ప్రభుత్వం, సీఎం చంద్రబాబేనని మంత్రులు స్పష్టం చేశారు. గతంలో 1 పంపు నుంచి మాత్రమే నీటిని డ్రా చేసుకునే పరిస్థితి ఉండేదని, 2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలోనే 6 పంపులను వినియోగించేలా సామర్థ్యం పెంచి హంద్రీ-నీవా పనులను నాడు చేపట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు.
ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 పంపుల సామర్థ్యాన్ని 12 పంపుల వరకు పెంచిందన్నారు. అలాగే 100 రోజుల్లో హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులను పూర్తి చేశామని.. ఇది కూడా ఓ రికార్డేనని మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రస్తావించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగమైన మచ్చుమర్రి ప్రాజెక్టు ఓ మేలి మలుపు అని… దాని నిర్మాణం వల్లే రాయలసీమకు నీరందించే విషయంలో సత్ఫలితాలు సాధించగలుగుతున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నాడు మచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ద్వారా సీమ ప్రజలకు ఈ స్థాయిలో నీటిని అందించేందుకు అవకాశం కలిగిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఈ పనులను సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణలో చేపట్టడంతో పాటు పక్కా ప్రణాళికను రూపొందించారని మంత్రులు ప్రస్తావించారు. ప్రస్తుతం హంద్రీ-నీవా నుంచి నీటిని డ్రా చేసే విషయంలో రికార్డ్ సృష్టించామని దీంతో పాటు మరో రికార్డ్ కూడా సృష్టించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఇక్కడితో ఆగకూడదని… 50 టీఎంసీల వరకు నీటిని హంద్రీ-నీవా ద్వారా సీమ జిల్లాలకు తరలించాలని మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం ఆదేశించారు. దీంతో పాటు రాయలసీమ ప్రాంతంలోని రిజర్వారయర్లు, చెరువులను నీటితో నింపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని చెరువులు, రిజర్వాయర్లు నిండినప్పుడే తనకు సంతోషమని సీఎం చంద్రబాబు చెప్పారు. చివరి ఎకరా వరకు నీళ్లందించాలని.. సీమ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసేలా పని చేయాలన్నారు. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి నెల మొదటి వారంలోగా అదనంగా మరో 10 టీఎంసీలను తరలించి మొత్తంగా 50 టీఎంసీల నీటిని తరలించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు తెలియచేశారు.















