అమరావతి (చైతన్యరథం): శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా ఆ తల్లి త్యాగాన్ని గౌరవిస్తూ ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించాం. ఆడబిడ్డల ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవం చాటేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ తల్లి చల్లని దీవెనలతో అందరికీ మేలు జరగాలని ప్రార్థిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి నిమ్మల
భీమవరం: వాసవీ అమ్మవారు అబల కాదు.. ఆది పరాశక్తి, స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం పశ్చిమ గోదావరి పెనుగొండ పుణ్యక్షేత్రంలో శ్రీవాసవీమాత కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. దీనికి హాజరైన మంత్రి రామానాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయానికి చేరుకున్నమంత్రికి వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీవాసవీ మాత కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆత్మార్పణ రోజును రాష్ట్ర పండుగగా సీఎం చంద్రబాబు ప్రకటించారన్నారు. ప్రభుత్వం పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చి ఆర్య వైశ్యులపై ఉన్న ప్రేమను చాటుకుందన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత, సత్యమార్గం నిలవాలని ఆకాంక్షించారు.













