- ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటకు వ్యూహాత్మక అడుగులు
- రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఏపీలో ఇన్నోవేషన్స్‌కు ప్రోత్సాహకాలు
- ఆవిష్కరణల్లో పెట్టుబడులపై అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం
- మౌలిక సదుపాయాలు, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో భారీగా తగ్గుతున్న పెట్టుబడులు
- ఇన్నోవేషన్స్‌పై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి నారా లోకేష్
దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కరణల కోసం స్థానికంగా పెట్టుబడులను సమీకరించి, దీర్ఘకాలిక రాబడులను ఇచ్చే ఆవిష్కరణల ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తూ తమ ప్రభుత్వం విశ్వసనీయ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ కాంగ్రెస్ విలేజ్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యాన.. దఢమైన ఆవిష్కరణల కోసం పెట్టుబడులను బలోపేతం చేయడంలో మనం ఎక్కడ.. (Where Capital Lands: Anchoring Investment for Resilient Innovation) అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్త ఆవిష్కరణలకు మూలధన పెట్టుబడుల్లో లోపాలు ఎందుకు ఉన్నాయి? పెట్టుబడి లేకపోవడం వల్ల ఆవిష్కరణలు ఎలా ఆగిపోతున్నాయి? ఆవిష్కరణాత్మక ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి పెట్టుబడులపై అంతర్జాతీయంగా ఏ విధంగా దృష్టిసారించాలి అనే అంశాలపై చర్చించారు. సదస్సులో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… పెట్టుబడులను ఆకర్షించడం అంటే కేవలం సంస్థలను తీసుకురావడం కాదు, ఆవిష్కరణకు అవసరమైన స్థిరమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడమని అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మేము స్వల్పకాలిక ప్రోత్సాహాకాలపై కాకుండా.. నమ్మకం, సామర్థ్యం, దీర్ఘకాలిక నిబద్ధత, విజిబిలిటీ కలిగి ఉంటేనే ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మేము ఆవిష్కరణ, పరిశ్రమ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాం. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్, సిస్కో, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ భాగస్వామ్యంతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లతోపాటు ఆర్ అండ్ డిపై ప్రత్యక్షంగా పెట్టుబడి పెడుతున్నాం. తద్వారా ఆలోచనలు వేగంగా స్టార్టప్‌లుగా మారతాయి. ఇదే సమయంలో మేము ప్రతిభపై కూడా పెట్టుబడి పెడుతున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
పెట్టుబడిదారులకు భరోసా
ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక ప్రతిభ ప్రపంచ సవాళ్లకు పరిష్కారం చూపుతుందని మేం భావిస్తున్నాం. ఈ దిశగా ముందుకు సాగుతూ మేము పారిశ్రామిక క్లస్టర్‌లలో ఆర్ అండ్ డిని ఏకీకృతం చేస్తూ టాలెంట్‌పై పెట్టుబడి పెట్టి, ప్రపంచ భాగస్వామ్యాలకు విశ్వసనీయ యాంకర్‌గా పనిచేస్తున్నాం. అనిశ్చితి లేని పాలసీలు, డిజిటల్ గవర్నెన్స్, భారతదేశంలో మొట్టమొదటి సారిగా పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు ఎస్క్రో మెకానిజంను ప్రవేశపెట్టాం. ఇవన్నీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించడమేగాక స్థిరమైన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. 2047 నాటికి క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించేందుకు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తెచ్చాం. ఈ రంగంలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి, 167 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫ్రంటియర్ టెక్నాలజీలలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ, భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. త్రిముఖ వ్యూహాలతో మేం ముందుకు సాగుతున్నాం. 1). వివిధ రంగాలకు సంబంధించిన క్లస్టర్లవారీ అభివృద్ధి. 2). విశ్వవిద్యాలయాలు, నైపుణ్య సంస్థలతో పరిశ్రమలను అనుసంధానించడం 3). దీర్ఘకాలిక విలువను సృష్టించే విధానాన్ని రూపొందించడం. ట్రిపుల్ హెలిక్స్ మోడల్‌ను ఉపయోగించి అప్లయిడ్ రీసెర్చి, కొలాబరేటివ్ ఆర్ అండ్ డి, పరిశ్రమ నేతృత్వంలోని ఆవిష్కరణ వేదికలలో స్థిరమైన పెట్టుబడిపై ఆంధ్రప్రదేశ్ దృష్టి సారిస్తోంది. ఇది ఆధునిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతోంది. ఇందుకోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించాం. కేవలం 18 నెలల వ్యవధిలో మా రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (ఎసఐపీబీ) ద్వారా రూ. 8.75 లక్షల కోట్ల ( 97 బిలియన్ డాలర్ల) విలువైన 211 ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ పెట్టుబడుల ద్వారా 8.36 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు.
ప్రభుత్వాలు దష్టిసారించాలి
అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించే క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక విభజన, సాంకేతిక అస్థిరతలు, పర్యావరణ సంక్షోభాలు, పెరుగుతున్న అసమానతలు ఇందుకు ప్రధాన అడ్డంకులుగా మారాయి. మరోవైపు డీగ్లోబలైజేషన్ జాతీయ-నియంత్రిత వ్యవస్థలను పెంపొందిస్తోంది. ఇది ఆర్థిక మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది. పెరిగిన పాలసీ అనిశ్చితి, వాణిజ్య అడ్డంకుల నేపథ్యంలో ప్రపంచ ఇన్నోవేషన్ క్యాపిటల్ తక్కువ గ్రాఫికల్ ప్రాంతాల్లో కేంద్రీకతమవుతోంది. ఇది సిస్టమిక్ రిస్క్‌ను, అసమానతలను సృష్టిస్తుంది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక ప్రకారం 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు భారీగా తగ్గిపోయాయి. పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు 31%, నీరు, స్వచ్ఛత రంగాల్లో 30%, వ్యవసాయ-ఆహార రంగాల్లో 19% తగ్గాయి. అంతర్జాతీయ సమాజ సంక్షేమంలో కీలకమైన ఈ రంగాలు దీర్ఘకాలికంగా తక్కువ నిధులతో ఉండటం ఆందోళనకరం. ఈ పరిస్థితుల్లో రెన్యువబుల్ ఎనర్జీ, రీజనరేటివ్ ప్రొడక్షన్, సమ్మిళత సమాజాలు, ఆహార వ్యవస్థలు వంటి రంగాల్లో ప్రభుత్వాలు స్థిరమైన పెట్టుబడులు పెట్టడం అత్యవసరం. లాభాలపై దృష్టి పెట్టే ప్రైవేట్ సంస్థలు ప్రాథమిక పరిశోధన, ప్రారంభదశ టెక్నాలజీలు, ఎకోసిస్టమ్ అభివృద్ధిపై తక్కువ పెట్టుబడులు పెడతాయి. ఈ అంతరాన్ని భర్తీచేయడానికి పబ్లిక్ ఫైనాన్స్ ద్వారా గ్రాంట్లు, ఆర్ అండ్ డి సబ్సిడీలు, మిశ్రమ ఆర్థిక సహాయం, వ్యూహాత్మక రంగాలలో నేరుగా పెట్టుబడులు పెట్టాలి. ఆవిష్కరణలకు అవసరమైన ఎకోసిస్టమ్ నిర్మాణానికి నియంత్రిత చట్రాలు, డిజిటల్, ఫిజికల్, ఎడ్యుకేషనల్ మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించడం తప్పనిసరి. స్థిరమైన ఆవిష్కరణల పెరుగుదలకు అవసరమైన నైపుణ్యాలతో వర్క్ ఫోర్స్‌ను సన్నద్ధం చేసే విద్య, శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు దృష్టిసారించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.













