- ‘ఈరోస్ ఇన్నోవేషన్స’ను రాష్ట్రానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- ‘దావోస్ మ్యాన’గా సీఎంను కీర్తించిన ఈరోస్ సంస్థ ఫౌండర్ కిషోర్ లుల్లా
జ్యూరిచ్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లా తో సమావేశమైన ముఖ్యమంత్రి…ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు సీఎం తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్, కో-ప్రెసిడెంట్ రిధిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్ లు పాల్గోన్నారు. ఈరోస్ జెన్ ఏఐ, ఎరోస్ యూనివర్స్ సూపర్ యాప్, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు, తదితర అంశాలను ఈరోస్ ప్రతినిధులు వివరించారు. ‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360’ పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నట్టు ఈరోస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని తన సహచరులకు పరిచయం చేసిన ఈరోస్ ఇన్నోవేషన్ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లా ‘దావోస్ మ్యాన్ చంద్రబాబు’ అంటూ ప్రశంసలు కురిపించారు.












