- ఖాతాల్లో బకాయిలు జమ చేసిన ప్రభుత్వం
- చెప్పినట్టుగానే ఒకరోజు ముందే..
- సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
అమరావతి(చైతన్యరథం) సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం బుధవారం చెల్లించింది. దీంతో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమవుతోంది. దాంతో ఆయా ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. అలాంటి వేళ ఏపీ పోలీస్ అసోసియేషన్ స్పందించింది. పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను ప్రభుత్వం విడుదల చేసిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈసారి సంక్రాంతి పండుగను తామం దరం చాలా సంతోషంగా జరుపుకుంటామని ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పారు. గతంలో సీఎం చంద్రబాబును కలిసి సరెండర్ లీవులకు సంబంధించిన నగదు విడుదల చేయాలని కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. తమకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నిధులు విడు దల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పోలీసులు అందరి తరపున కృతజ్ఞతలతో పాటు సంక్రాంతి పండగ శుభా కాంక్షలు తెలిపారు. అలాగే ఈ నిధులు విడుదలకు సహకరించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి అనితతోపాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈ సందర్భంగా శ్రీనివాసరావు కృతజ్ఞతలు చెప్పారు.
సంక్రాంతి పండగవేళ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యో గులు, పోలీసులకు డీఏ, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవులతో పాటు కాంట్రాక్టర్లకు పెండింగులో ఉన్న బిల్లులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చెప్పినట్టుగానే భోగి రోజు ఈ నగదు బకాయిలు చెల్లించింది. నగదు ఖాతాల్లో జమ కావడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. డీఏ, డీఆర్ఎ ఎరియర్స్ నిమిత్తం ఒక్కో ఉద్యోగి, పోలీసుల ఖాతాల్లో రూ.70 నుంచి రూ.80వేల వరకు నగదు జమ అవుతుంది. పండగ పూట డీఏ, డీఆర్ఎ బకాయిలు జమకావడంతో ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. సుమారు 5, 70లక్షల మంది ఖాతాల్లో ఈ నిధులను ఆర్థికశాఖ జమ చేస్తోంది. ప్రభుత్వానికి, సీఎంకు ఉద్యోగ సంఘాలు సైతం కృతజ్ఞతలు తెలియజేశాయి.















