- యువత భవితను తీర్చిదిద్దే కేంద్రం- తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-AP FIRST పేరిట ఏర్పాటు
- తిరుపతి IIT-IISER సంయుక్త నిర్వహణ
- ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ- డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహదారులతో సమావేశంలో సీఎం అంగీకారం
- యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా పరిశోధనలు అవసరమని సూచన
- యువతకు.. రాష్ట్రానికి మేలు జరిగేలా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా ఏపీ ఫస్ట్ ను అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్యరథం): యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని… ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు… ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతి పెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-AP FIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఎయిరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ-సైబర్ సెక్యూర్టీ, సెమీ కండక్టర్ల డివైసెస్-సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రొత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈతరహాలో కొత్త ఆవిష్కరణలకు… వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రంవేదికగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇలా వచ్చే కంపెనీలకు… పరిశ్రమ లకు నైపుణ్యమున్న యవతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా… స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఓ అతి పెద్ద రీసెర్చ్ కేంద్రం అవసరం. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ-ఫస్ట్ వ్యవస్థ ఆ అవసరా లను తీర్చేలా… రాష్ట్రంలోని యువతకు సహకరిం చేలా పూర్తి స్థాయిలో పనిచేయాలి. తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీ-ఫస్ట్ ఏర్పాటు కాబోతోంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలి. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
వర్శిటీలు, కంపెనీలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో అనుసంధానం
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన నిరంతరం ఏపీని అభివృద్ధి చేయడంతోపాటు… యువతకు చక్కటి ఉపాధి కల్పించడంపైనే ఉంటుంది. సంక్షేమానికి -అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఆలోచన చేస్తుందో… యువతకు మెరుగైన అవకాశాలు అందించే విషయంలోనూ అదే స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంట్లో భాగంగానే ఏపీ ఫస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. యూనివర్శిటీలు, వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకోవాలి. ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్శిటీల్లో విద్యార్థులు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వాటిని అందిపుచ్చు కోవాలి. దీంతో యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు పరిశ్రమలు, కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. దీంతో పాటు అందుబాటులోకి వస్తోన్న టెక్నాలజీలు ఏంటీ… ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతోందనే విషయాలను గుర్తించి.. వాటిని కరిక్యులమ్లో చేర్చేలా విద్యా సంస్థలతో సంప్రదింపులు జరపాలి. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు కరిక్యులమ్ ప్రిపేర్ చేసేలా ఏపీ ఫస్ట్ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు తెలుగువాళ్లు ఐటీలో మేటిగా ఉన్నారు. అలాగే ఫార్మా రంగంలో భవిష్యత్ ఉంటుందని గుర్తించడం వల్లే తెలుగు రాష్ట్రాలు ఫార్మాలో అగ్రభాగాన ఉన్నాయి. ఇదే తరహాలో భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యువత భవిత కోసం… స్టార్టప్ కంపెనీలకు మరింత చేయూతనివ్వడం కోసం ఏపీ ఫస్ట్ వ్యవస్థ కృషి చేయాలి. వచ్చే మూడేళ్లల్లో కీలక పురోగతి కనబరిచేలా ఏపీ ఫస్ట్ పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
డ్రోన్లతో సేవలందించవచ్చని నిరూపిద్దాం
డ్రోన్ కార్పొరేషన్ను మరింత బలోపేతంచేయాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్లను వినియోగిం చి బాధితులకు సేవలు అందించాం. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో డ్రోన్లను వినియోగించుకుని ప్రజలకు సేవలు అందించేలా చూడాలి. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిల్లో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఫ్యూచర్ టెక్నాల జీలు.. కానీ వీటికి మనం ఇప్పటి నుంచే సంసిద్ధం కావాల్సి ఉంది. వివిధ దేశాల్లో డ్రోన్ల ద్వారా ఎలాంటి. సేవలు అందుతున్నాయోననే అంశాన్ని పరిశీలించా లి… అధ్యయనం చేయాలి. టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. టెక్నాల జీని అందరూ అందిపుచ్చుకున్నాక… మనం అప్పుడు మేల్కొనే కంటే… ముందుగానే టెక్నాలజీని అంది పుచ్చుకునేలా మన వ్యవస్థలను సిద్ధం చేయాలి. డ్రోన్ కార్పొరేషన్ నిపుణులతో కూడిన సలహా బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఇంటర్నేషనల్ డ్రోన్ డే నాటికి డ్రోన్ల ద్వారా సేవలు ఏ విధంగా అందించ వచ్చోననే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలకు కళ్లకు కట్టేలా చూపాలి. డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్స్ వంటి అంశాల్లో లోతుగా అధ్యయనం చేయండి. కేంద్రంతో సంప్రదింపులు జరిపి.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ తరహాలో డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చేమోననేది పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీష్ రెడ్డి, ఐటీ- డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















