- తప్పుడు ఆరోపణలకు ఘాటుగా కౌంటర్లు
- పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం
- కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం
- తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న వైసీపీ కుట్రలను ప్రస్తావించిన నేతలు
- కఠినచర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టీకరణ
- పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొనాలని ఆదేశం
అమరావతి (చైతన్యరథం): వైసీపీ చేసే తప్పుడు ఆరోపణలకు.. ఫేక్ ప్రచారాలకు గట్టిగా జవాబు ఇవ్వాలని పార్టీ నాయకులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో శనివారం సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలు, పార్టీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. తిరుమల కొండపై వైసీపీ కుట్రలు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, భోగాపురం ఎయిర్ పోర్టు, రాయలసీమ లిఫ్ట్, తెలంగాణ సీఎం రేవంత్ తాజా కామెంట్లపై నేతలు ప్రస్తావించారు. తిరుమల కొండపై వైసీపీ నేతలతో మద్యం బాటిళ్లను పెట్టించి కుట్ర పన్నడమే
కాకుండా… తిరిగి ప్రభుత్వంపై ఆ పార్టీ నేత భూమన కరుణాకర్రెడ్డి ఎదురు దాడి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన నేతలు. కుట్రపూరితంగా మద్యం
బాటిళ్లు పెట్టి తిరుమల పవిత్రతను… భక్తుల మనోభాలను దెబ్బతీస్తున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి అంశంలో వైసీపీ నేతల
కుట్రలు బట్టబయలు అవుతున్న సందర్భంలో మద్యం బాటిళ్లతో కొత్త కుట్రలు పన్నుతూ వైసీపీ పేట్రేగిపోతోందని సమావేశంలో నేతలు విశ్లేషించారు.
సీసీ కెమెరాలు, టెక్నాలజీ సాయంతో వైసీపీ కుట్రలు బయటపడుతున్నా వైసీపీ మూకలు బరితెగించి వ్యవహరిస్తున్నాయని సీఎం దృష్టికి కొందరు నేతలు తీసుకువచ్చారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే సహించం
దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని… కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ చేస్తోంది రాజకీయ దాడి కాదని… హిందూ మతంపై దాడి అంటూ కొందరు నేతలు అన్నారు. అధికారంలో ఉన్నప్పటి నుంచి జగన్ తీరు చూస్తుంటే.. హిందూ మతాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. దేవాలయాలపై మహమ్మద్ గజిని వరుస దాడులు చేసినట్టు జగన్ కూడా హిందూ మతంపై దాడులు చేస్తున్నారంటూ అభివర్ణించారు. అధికారంలో ఉండగా… దేవాలయాలపై దాడులను ప్రేరేపించిందే కాకుండా… నాడు వైసీపీ నేతలు వాటి గురించి చాలా తేలికభావంతో మాట్లాడిన అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అంతర్వేది రథం తగులబడిన ఘటన, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మూడు సింహాలు చోరీ విషయంలో నాడు కొడాలి నాని వ్యాఖ్యలను నేతలు గుర్తు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా పరకామణి చోరీని కూడా చిన్నపాటి దొంగతనంగా జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారని కొందరు నేతలు ప్రస్తావించారు. లంచం తీసుకుని టీటీడీ ఉద్యోగి విజయ్ భాస్కర్ రెడ్డి కల్తీ నెయ్యి సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆధారాలు లభించటంపై సమావేశంలో చర్చ జరిగింది. హిందూ సంప్రదాయాలను పాటించని జగన్ మోహన్ రెడ్డికి వాటిని గౌరవించడం కూడా ఇష్టం లేదని మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఏ మతం ఆచరించినా… ఇతర మతాలను గౌరవించాలి… మనోభావాలకు విలువ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇతర మతాలపై దాడి చేయడం… భక్తుల మనోభావాలను కించపరిచేలా జగన్ వ్యవహరించడమే కాకుండా… స్వయంగా తానే ప్రొత్సహిస్తున్నారని మరో సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని… జగన్ మోహన్ రెడ్డి ఏకంగా తిరుమల దర్శనానికే రాలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రభుత్వ కృషిని ప్రజలకు వివరించండి
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సీఎం సూచించారు. నెలలో వారం రోజుల పాటు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. చర్చించుకుని నీటి సమస్యలను పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. గొడవలు వద్దు… నీళ్లు కావాలని తాను చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్ పోర్టు వంటి అంశాలపై వైసీపీ తప్పుడు ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగా జవాబు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
















