- వైసీపీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
- నీటి విషయంలో గొడవ పడితే నష్టపోయేది తెలుగు ప్రజలే –
- వృథా జలాల సద్వినియోగంతో సుభిక్షంగా రెండు తెలుగు రాష్ట్రాలు
- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): నీటి విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వృథా జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాయలసీమకు నీరందించామనేందుకు పట్టిసీమ ప్రత్యక్ష ఉదాహరణ అని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగానే రాయలసీమలో ఉద్యానరంగం అభివృద్ధి చెందిందన్నారు.
పూర్తిచేయకుండా 2020లోనే నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్లో వైసీపీ నేతలు స్వార్థరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేవలం మట్టిపనులు చేసి రూ.900కోట్లు బిల్లులు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి విషయంలో రాజీపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. జగన్కు నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చేయరని చంద్రబాబు అన్నారు. సింధు నాగరకత ఎలా వచ్చిందో అతను తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు ఎక్కువగా నదీ తీరాల వెంబడి ఉండబట్టే అభివృద్ధి చెందాయని తెలిపారు. లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలూ నదీతీర ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. నదీ గర్భానికి.. నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చిమ్మటం మానట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నీటిని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందిందన్నారు. దేశంలోనే ఉద్యాన రంగంలో మొదటి స్థానంలో ఉన్నాం.. రానున్న పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి వెళ్తామని పేర్కొన్నారు.
















