- తండ్రికి తగ్గ తనయుడు
- ఏపీ అభివృద్ధికి పవర్ హౌస్
- మంత్రి లోకేష్‌పై ‘ది వీక్’ ప్రశంసలు
- కవర్ పేజీ ఫొటోతో ప్రత్యేక కథనం
అమరావతి (చైతన్యరథం): తండ్రికి తగ్గ తనయుడిగా, రాష్ట్రానికి దిక్సూచిగా.. ఆంధ్రప్రదేశ్ యువత కలలకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఒక కొత్త ఆలంబనగా మారారు. మంత్రి లోకేష్ పనితీరుపై జాతీయ స్థాయి ప్రముఖ వారపత్రిక ది వీక్ ప్రశంసల జల్లు కురిపించింది. తన తాజా సంచికలో లోకేష్ ఫొటోను కవర్ పేజీపై ప్రచురిస్తూ.. ఆయన పాలనా శైలిలోని వేగాన్ని, పనుల అమలు తీరును ప్రత్యేకంగా విశ్లేషించింది. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా, నిర్దేశిత కాలపరిమితిలో ఫలితాలను సాధించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని, ఏపీ అభివృద్ధిలో ఆయన ఒక పవర్ హౌస్‌లా మారారని ప్రశంసించింది.
లోకేష్ అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ది వీక్ ప్రశంసించింది. గతంలో పరిశ్రమల స్థాపనకు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు లోకేష్ పర్యవేక్షణలో అనుమతుల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోందని పేర్కొంది. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో ఆయన చూపుతున్న చొరవ, ఇన్వెస్టర్లతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే తీరు ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తోందని విశ్లేషించింది.
రాజకీయ వారసుడిగా అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును లోకేష్ సంపాదించుకున్నారని ది వీక్ అభిప్రాయపడిరది. కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో శిక్షణ వల్ల వచ్చిన సామర్థ్యం, నైపుణ్యాలను క్షేత్రస్థాయి పాలనలో అమలు చేస్తూ, ఐటీ , విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ప్రశంసించింది. ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆయన చేస్తున్న కృషి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించింది.
తండ్రి చంద్రబాబు నాయుడు అనుభవం, విజన్‌కు లోకేష్ వేగం తోడవ్వడం రాష్ట్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా దివీక్ అంచనా వేసింది. తండ్రి చంద్రబాబు నాయుడు..హైదరాబాద్‌ను ఐటి హబ్‌గా మార్చిన స్ఫూర్తితో, లోకేష్ ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఇండస్ట్రియల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దుతున్నారు. రాజకీయ విమర్శలకు తన పనితీరుతోనే సమాధానం చెబుతూ, 2047 నాటికి ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో నారా సాగిస్తున్న ప్రయాణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ది వీక్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టికి కేంద్రబిందువుగా మారిన లోకేష్‌ను మ్యాగజైన్ ‘చీఫ్ జాబ్ క్రియేటర్’గా అభివర్ణించింది.
నేను కేవలం మంత్రిని కాదు, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే చీఫ్ జాబ్ క్రియేటర్‌గా గుర్తింపు పొందాలనుకుంటున్నాను.. అన్న లోకేష్ ఆశయం ఈ కవర్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.













