- సమస్యలకు తక్షణ పరిష్కారం
- భూ సంబంధిత సేవలన్నీ సరళీకృతం
- రైతులకు ఇబ్బందులు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు
- 22 ఏ జాబితా నుండి పట్టా భూములకు విముక్తి
- రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టీకరణ
- రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభించిన మంత్రి
వేమూరు (చైతన్యరథం): భూమికి సంబంధించిన సేవలన్నీ సరళీకృతం అయ్యాయని, భావి తరాల వారు భూ సమస్యలతో ఇబ్బందులు ఉండరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాజముద్రతో నూతనంగా ప్రచురించిన రీ సర్వే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. దోనేపూడి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తొలుత రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన రెవిన్యూ దస్త్రాల ప్రదర్శనశాలను మంత్రి సత్యప్రసాద్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు, సీసీఎల్ఎ ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట కలిసి పరిశీలించారు. జి. ఆశీర్వాదం, నాగ కిషోర్ భూముల వివరాలను ఆన్ లైన్ లో పరిశీలించారు. దోనేపూడి గ్రామంలో రీ సర్వే పూర్తిగా ముగిసినందున జిల్లా స్థాయి కార్యక్రమానికి ఈ గ్రామంలో శ్రీకారం చుట్టారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా..
ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ రైతులంతా సుభిక్షంగా ఉండాలనే ఏకైక ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 17,500 రెవిన్యూ గ్రామాలు ఉండగా, క్షేత్రస్థాయిలో భూ వివాదాలు అధికంగా ఉన్నాయన్నారు. భూ సమస్యలు, గౌడవలు పరిష్కరించడానికే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భావితరాల ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడకుండా ఉండడానికి, పేద ప్రజలు క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. గ్రామాలు బాగుండాలి, అభివృద్ధిలోకి రావాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. విద్యా రంగాన్ని సరిచేస్తూ.. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే దిశగా విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని వివరించారు. గ్రామ సభలు, రెవిన్యూ సదస్సులలో ప్రజల నుంచి వచ్చిన రెండు లక్షలకు పైగా వచ్చిన ఫిర్యాదులను అధ్యయనం చేసి పరిష్కరించామన్నారు. రీ సర్వేను సమర్థంగా నిర్వహిస్తూ భూమి దస్త్రాలలో అవకతవకలను పూర్తిగా అరికడుతున్నామన్నారు. 22 ఏ లో నుంచి పట్టా భూములను తొలగించి, రైతులకు పూర్తిగా హక్కు పత్రాలు అందిస్తున్నామని
వివరించారు. భూమికి సంబంధించిన సేవలన్నీ సరళతరం అవుతున్నాయన్నారు. చుక్కల భూమిలో నుంచి పట్టా భూములను తొలగిస్తున్నామన్నారు.
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ కార్యాలయాలలో లంచం అడిగినా….. అధికారులు తప్పు చేసినా ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. తప్పు చేసినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు ఉంటామని, అవసరమైతే వారిని ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో పారదర్శకతతో పాలన సాగుతోందని వివరించారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లను వారి భూమికి అనుసంధానిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. 18 నెలల కూటమి పాలనలో 42 కార్యక్రమాలు అమలు చేశామని, సూపర్ సిక్స్ ప్రకటించినప్పటికీ సూపర్ 18 అమలు చేయడంతో గ్రామాల ప్రజలలో సంతోషం వెల్లివిరుస్తోందన్నారు. గ్రామాలలోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. పెట్టుబడిదారులను సమీకరించడం ద్వారా పరిశ్రమలు వస్తున్నాయని, భావితరాలకు నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. రాష్ట్రంలో 13 లక్షల ఉద్యోగ అవకాశాలు యువతకు వస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. విద్యుత్ బిల్లులో ఒక యూనిట్కు 13 పైసలు తగ్గించడం ద్వారా ప్రజలకు భారీ మేలు జరిగిందని మంత్రి అనగాని వివరించారు.
కూటమి పాలనలో రైతులకు మేలు: ఎంపీ కృష్ణప్రసాద్
భూమి సమస్యలు, మోసాలను అరికడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధునాతన వ్యవస్థను ప్రవేశపెట్టడం అభినందనీయమని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెవెన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయన్నారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలి, పారదర్శకంగా సేవలందించాలన్నారు. రైతుల జీవితాల్లో ఆనందం నింపడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలో రైతుల భూమి వివరాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. కూటమి పాలనలో రైతులకు మేలు జరుగుతోందన్నారు.
రైతుల సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే ఆనందబాబు
రాజ ముద్రతో రీ సర్వే పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం సంతోషదాయకమని వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు చెప్పారు. భూమిపై తరతరాల వారసత్వ హక్కు ప్రజలకు ఉంటుందని, అలాంటి అనుబంధం ఉన్న భూ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అలాంటి భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని, రెవిన్యూశాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది చిత్తశు ద్ధితో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న భూ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతోందన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం దోనెపూడి గ్రామంలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
రెవిన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే ప్రభుత్వం కృషి చేస్తోందని సిసిఎల్ఎ ముఖ్య కమిషనర్ జయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్ లైన్లో రెవిన్యూ దస్త్రాల ద్వారా 5 సేవలు గ్రామ సచివాలయాల వద్దనే. పొందవచ్చన్నారు. రానున్న జులై నుంచి భూమి రిజిస్ట్రేషన్ పూర్తికాగానే ఆన్లైన్ ద్వారానే వన్ బి అడంగల్లో వాటంతట అవే పేర్లు మార్పు జరుగుతాయన్నారు. పారదర్శకంగా రెవెన్యూ సేవలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామన్నారు. ఆ పుస్తకాలలో క్యూఆర్ కోడ్ ఉంటుందని, తద్వారా రైతులు తమ భూమి వివరాలు, మ్యాపు, సరిహద్దులు చూసుకునే. వెసులుబాటు ఉందన్నారు. అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ సేవలు పొందచ్చని వివరించారు. ఈ కేవైసీ ద్వారా పాసు పుస్తకాలు ఇస్తున్నామన్నారు.
రీ సర్వేతో భూ సమస్యలన్నీ సంపూర్ణంగా పరిష్కారం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మంత్రి తొలి కార్యక్రమం కొల్లూరు మండలంలో జరపడం సంతోషదాయకం అన్నారు. భూముల వివరాలన్నీ వెబ్ ల్యాండ్ ద్వారా అందుబాటులోకి వచ్చాయన్నారు. 22 ఏ నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియను ప్రణాళికతో చేపట్టామన్నారు. రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. అలాగే పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తున్నామన్నారు.















