- ఎస్బీఐలో ఎస్‌జీఎస్‌పీ ఖాతా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయం
- సచివాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఎస్‌జీఎస్‌పీ బీమా పథకం ఎంతో ఊరటగా ఉంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ూGూూ (స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజి) ఖాతా ద్వారా కల్పిస్తున్న ప్రమాద మరణ బీమా పథకంలో భాగంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్టీఆర్ జిల్లా నందివాడ ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సోమవారం రూ.కోటి చెక్కును అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బీమా పథకం వరం లాంటిదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంకే మీనా, ఎక్సైజ్ కమిషనర్ సిహెచ్. శ్రీధర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాహుల్ దేవ్ శర్మ, ఉద్యోగ సంఘాల తరఫున ఏపీ పీఈఈఓఏ అధ్యక్షులు కె.కామేశ్వర రావు, బి.నర్సింహాలు, బి. రమణ, ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ సూర్యప్రకాశ్, ఏజీఎం పి.రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ఇంత మొత్తంలో బీమా అందించడం సంతోషంగా ఉందన్నారు. ఎస్బీఐలో ఎస్‌జీఎస్‌పీ ఖాతా కలిగిన ఉద్యోగులకు బీమా ప్రయోజనాలు అందించడం హర్షణీయమన్నారు. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఉత్తమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉద్యోగ సంఘం ప్రతినిధులు కృత్ఞతలు తెలియజేశారు.














