- త్వరలోనే 75 లక్షలమంది విద్యార్ధులకు ఆరోగ్యపరీక్షలు
- రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ ప్రకటించిన సీఎం చంద్రబాబు
- తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో విద్యార్థినులతో ముఖాముఖి
- పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ చొరవను అభినందించిన సీఎం
అనకాపల్లి, తాళ్లపాలెం (చైతన్య రథం): చిన్న చిన్న ఆలోచనలు ఒక్కో సందర్భంలో అభివృద్ధికి బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా సీఎం పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న కార్యక్రమాన్ని తాళ్లపాలెం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రారంభిస్తున్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు. రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థినులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘విద్యార్ధుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా కార్యక్రమం చేపట్టాం. పాఠశాలకు చక్కటి యూనిఫాంతో వచ్చి పరిశుభ్ర వాతావరణంలో చదువుకోవాలి. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో ముస్తాబు కార్యక్రమం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈతరహా కార్యక్రమాలవల్ల విద్యార్ధుల్లో శ్రద్ధ పెరుగుతుంది. ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లలో 75 లక్షలమంది విద్యార్ధులు ఇంటర్ వరకూ చదువుతున్నారు.
ముస్తాబులాంటి కార్యక్రమంవల్ల వ్యక్తిగత శుభ్రతతోపాటు నాయకత్వ లక్షణాలు అలవడతాయి. చక్కగా తలదువ్వుకోవటం, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవటంవల్ల ఆరోగ్యంగా ఉంటారు. డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే ‘ముస్తాబు’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు రావాలని కోరుతున్నాను. తల్లితండ్రులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులపైనే ఆశలు పెట్టుకుంది. అందరికీ ‘తల్లికి వందనం’ కింద ఆర్ధిక సాయం అందించాం. విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించాలనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, భోజనం అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం. జీవితంలో ఏం సాధించాలన్నా చిన్న వయస్సునుంచే కృషి చేయాలి. విద్యార్ధులంతా రాష్ట్రానికి చెందిన ఆస్తి. విద్యార్థులు నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలి. మంచి ఉపాధి, ఉద్యోగాల్లో విద్యార్ధులంతా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షలమంది విద్యార్ధుల ఆరోగ్యాన్ని కూడా త్వరలోనే పరీక్షిస్తాం. విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉండేలా మంచి పౌష్టికాహారం ఇస్తున్నాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యాశాఖలో వినూత్నమైన సంస్కరణలు తీసుకువస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే కృషి చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కొన్ని ఆలోచనలు అందరిలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయి. అలాంటి కార్యక్రమమే ముస్తాబు. అందుకే దీన్ని అన్నిచోట్లా అమలు చేయాలని నిర్ణయించాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.















