- పీఎం సూర్యఘర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి
- సూర్యఘర్, కుసుమ్ పథకాలతో విద్యుత్ చార్జీల ఊరట
- వినియోగదారులకు 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా
- ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
తిరుపతి (చైతన్యరథం): గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి రాయలసీమ అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మంత్రి గొట్టిపాటి ఆదివారం తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఎనర్జీ ఎగ్జిబిషన్‌కు హాజరైన మంత్రి, విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు. ఇంధన పొదుపు, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ టెక్నాలజీలపై ఆధారపడి రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను మంత్రికి విద్యార్థులు వివరించారు. విద్యార్థుల సృజనాత్మకతను మంత్రి ప్రశంసిస్తూ, భవిష్యత్తు ఇంధన రంగానికి ఇవి దిశానిర్దేశకంగా నిలుస్తాయని అన్నారు.
ఎగ్జిబిషన్ సందర్భంగా పీఎం సూర్యఘర్, కుసుమ్, స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకాలకు మరింత విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కట్టుబడి ఉందని, కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ హబ్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంధన రంగంలో నూతన ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన ముగింపు సభలో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి రాయలసీమ అత్యంత అనుకూలమైన ప్రాంతమని పేర్కొన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని, పగటిపూట ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను బ్యాటరీ స్టోరేజ్ సిస్టం ద్వారా భద్రపరిచి అవసరానికి వినియోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వినియోగదారుడికి 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా కరెంట్ బిల్లులను తగ్గించుకోవచ్చని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ కూడా అందుతుందని, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ శాఖ చేపడుతున్న ప్రాజెక్టులను విద్యార్థులు సందర్శించేలా అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ, విద్యార్థుల ప్రతిభను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
















