- పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ప్రకటన
- 25 లోక్‌సభ స్థానాలకు నేతల నియామకం
- బీసీలకు 8, ఎస్సీలకు 4, ఎస్టీ, మైనారిటీకు ఒక్కొక్కటి
- 5 అధ్యక్ష స్థానాలు మహిళలకు
అమరావతి (చైతన్యరథం): పార్లమెంటు నియోజకవర్గాల (జిల్లా) రథసారథులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు లోకసభ నియోజకవర్గ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేయగా ఆదివారం జాబితాను పార్టీ అధికారికంగా ప్రకటించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం, నాయకుల సామర్థ్యం, సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత, రాజకీయ అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగానే పదవులకు నేతలను ఎంపిక చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా నాయకులను ఎంపిక చేసి పదవులు కేటాయించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే యువనేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. పదవుల కేటాయింపులో సీనియర్లు, జూనియర్లకు మధ్య సమతూకం పాటించారు. భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేసే క్రమంలో చురుగ్గా ఉండే యువతకు, వివాదరహిత నేతలకు జిల్లా పగ్గాలు అప్పగించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా బడుగులకు ఎక్కువ పదవుల కేటాయించారు. పార్టీకి మూలస్తంభాలైన బీసీలకు సింహభాగం పదవులు కేటాయించారు. 25 పార్లమెంట్ అధ్యక్షులకు గాను 14 స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారు. అందులో బీసీలకు 8, మైనార్టీలకు 1, ఎస్సీలకు 4, ఎస్టీలకు ఒకటి, ఓసీలకు 11 చోట్ల అవకాశం కల్పించారు.
మహిళలకు కూడా ఎక్కువ సంఖ్యలోనే ప్రాతినిథ్యం కలిపించారు. 5గురు మహిళలకు పార్లమెంట్ అధ్యక్ష స్థానాలు కేటాయించారు. మోజోరు తేజోవతి, గద్దె అనూరాధ, పనబాక లక్ష్మి, గుడిశె కృష్ణమ్మ, గౌరు చరితా రెడ్డిలకు పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. నలుగురు ఎమ్మెల్యేలకు పార్లమెంట్ అధ్యక్ష పదవులు అప్పగించారు. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, ఉగ్ర నరసింహారెడ్డి, గౌరు చరితా రెడ్డి, ఎంఎస్ రాజులకు పార్లమెంట్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. కీలక పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అధిష్టానం సీనియర్ నేతలకు అప్పగించింది. నెల్లూరు పార్లమెంట్‌కు బీదా రవిచంద్ర, విజయవాడ పార్లమెంటుకు గద్దె అనూరాధ, తిరుపతి పార్లమెంటుకు పనబాక లక్ష్మీ నియామకం ఈ కోవలోనే చూడాలి. గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా పదవుల కేటాయింపు జరిగింది. క్షత్రియ సామాజిక వర్గం నుంచి మంతెన రామరాజు, కాపు సామాజిక వర్గం నుంచి జ్యోతుల నవీన్, శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి గుత్తల సాయికి పార్లమెంట్ అధ్యక్ష పదవులు అప్పగించారు.















