- పరీక్ష రాసిన విద్యార్థిలా..ఫలితాలకై ఎదురు చూస్తా
- సర్వీస్ సెక్టార్ల త్రైమాసిక ఫలితాలపై సీఎం వ్యాఖ్య
- వివిధ శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్ష
- శాఖల ప్రగతిపై ప్రజంటేషన్లు ఇచ్చిన ఉన్నతాధికారులు
అమరావతి (చైతన్య రథం): వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లలో సాధించిన త్రైమాసిక ఫలితాలపై తాను పరీక్షలు రాసిన విద్యార్ధిలా ఎదురు చూస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ఈసారి వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతంగా పెట్టుకున్నామని, మొత్తం 17 వర్టికల్స్‌లో ఫలితాలు సాధిస్తేనే జీఎస్టీపీ పెరుగుతుందని తెలిపారు. లైవ్ స్టాక్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫిషింగ్ సహా వేర్వేరు రంగాల్లో ఈ ప్రగతిని సాధించాలన్నారు. జీఎస్టీపీ సాధనలో జిల్లాస్థాయిలో పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. పశుగ్రాసం పెంచే అంశంపై డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాల వల్ల ఏపీ.. దక్షిణ భారతదేశంలో చివరి స్థానానికి చేరిందన్న సీఎం.. దీనిని తిరిగి గేరప్ చేసి అగ్ర స్థానానికి చేర్చాలని అన్నారు. రూ.70 వేల కోట్ల ప్రయివేట్ పెట్టుబడులు ఉద్యానపంటల రంగంలో రావాల్సిన అవసరం ఉందని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల తొలిరోజు సమావేశం సాగింది. వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి.. ఆయా శాఖలకు చెందిన ప్రగతిపై ఉన్నతాధికారుల నుంచి ప్రజంటేషన్లు తీసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం ఎప్పుడూ డిమాండ్ డ్రివెన్‌గా ఉండాలన్నారు. జీఎస్డీపీ సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని, జిల్లాస్థాయిలో పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా కొన్ని ప్రాంతాలకు చేయూత ఇస్తున్నామని అంటూనే, ప్రతీ యూనిట్, ప్రతీ శాఖలో సామర్ధ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే కలెక్టర్ల సదస్సుకు ప్రగతిలో, కలెక్టర్లు, ఉన్నతాధికారుల పనితీరులో క్వాంటం ఇంప్రూవ్‌మెంట్ కనిపించాలని ఆదేశించారు. 2024 తర్వాత జీఎస్డీపీ కాస్తంత మెరుగైందని, వ్యవసాయరంగంపై మరింతగా ఫోకస్ పెట్టాలన్నారు. వ్యవసాయ రంగంలో ఎంత చేస్తున్నా… ఇంకా మిగిలే ఉంటుందని అంటూ.. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మన ఉత్పత్తులను పంపేలా చేయగలిగితే వ్యవసాయ రంగం సుస్థిరత సాధిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో పంటలు పండిరచాలని, ఉద్యాన రంగంలోనూ భారీఎత్తున పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘రబీ, ఖరీఫ్ రబీ మూడు సీజన్లు స్వల్ప కాలిక, ఐదేళ్ల కాలానికి మధ్య, 10-15 ఏళ్లకు దీర్ఘకాలిక ప్రణాళికల్ని తయారు చేసుకోవాలి. డిమాండ్ డ్రివెన్ పంటలు, వాటర్ సెక్యూరిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్‌లాంటి పదిసూత్రాలను ఇంటిగ్రేట్ చేసుకోవాలి. హార్టికల్చర్ విషయంలో ఏపీ నెంబర్ 1గా ఉన్నాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్వోదయ కింద అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నాం. 2047కు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. ఏ ఒక్కరు వెనుకపడినా లక్ష్యాలను చేరుకోవటం కష్టతరం అవుతుంది. గేట్స్ ఫౌండేషన్, అగ్రివాచ్‌లాంటి సంస్థల సేవల్ని వినియోగించుకుని రైతులకు లాభసాటిగా ఉండేలా చర్యలు తీసుకోండి. దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా చర్యలు ఉండాలి. 60-70 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు కూడా ఉద్యాన పంటల రంగంలో రావాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన ఉత్పత్తులను పండిరచేలా రైతులకు అవగాహన చైతన్యం కల్పించాలి. సేవల రంగంలో పర్యాటకం కూడా కీలకం. బాపట్లలోని సూర్యలంకలాంటి బీచ్‌ల వద్ద ప్రముఖ బ్రాండ్లు వచ్చేలా చూడండి’’ అని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంలో ఐటీ, విద్యా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘‘విశాఖ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలను గ్రౌండ్ చేసుకునేలా భూకేటాయింపులు చేసుకోవాలి. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. ఐటీ, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ మంత్రులంతా దీనిపై ప్రత్యేక దృష్టితో ఉన్నాం’’ అని స్పష్టం చేశారు.














