- జీఎంఆర్` మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధి
- ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నది ఓ చరిత్ర
- కొంతమంది విజన్‌లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు
- అయినా సాహసోపేత నిర్ణయాలతో ముందుకు
- 99 పైసలకే భూములు ఇవ్వడం వల్లనే ప్రతిష్టాత్మక సంస్థల రాక
- ఏపీ అభివృద్ధికి మిస్సైల్స్‌గా పనిచేస్తున్నాం
- మాకు జీపీఎస్‌లా సీనియర్ల మార్గదర్శకత్వం
- ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్‌ఫోర్స్‌లో 25 శాతం తెలుగువారు ఉండాలనేది లక్ష్యం
- జీఎంఆర్` మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ ప్రారంభ వేడుకలో మంత్రి నారా లోకేష్
- మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్- మాన్సాస్ మధ్య ఎంవోయూ
విశాఖపట్నం (చైతన్యరథం): జీఎంఆర్ ` మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది.. ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర.. ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్‌ఫోర్స్‌లో 25 శాతం తెలుగువారు ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. మాన్సాస్ ట్రస్ట్ సహకారంతో భోగాపురం సమీపంలో భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో జీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేయనున్న జీఎంఆర్` మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్‌కు మంగళవారం అంకురార్పణ జరిగింది. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్- మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. బీహార్‌లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లినప్పుడు చాలా మంది కేంద్ర, రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారన్నారు. అక్కడ ఓ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాను. 18 నెలలుగా ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతోందని, ఆ మ్యాజిక్ వెనుక సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు. ఒకటి మిస్సైల్స్, రెండోది జీపీఎస్ అని నేను సమాధానం చెప్పారు. జీపీఎస్ అంటే వేదికపై ఉన్న అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటి పెద్దలు. మిస్సైల్స్ కూడా వేదికపై ఉన్నారు. మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కె.రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మేం మిస్సైల్స్‌గా పనిచేస్తున్నాం. ఎలాంటి మిస్సైల్స్‌కన్నా దారి చూపించే జీపీఎస్ కూడా చాలా అవసరమని మంత్రి లోకేష్ అన్నారు.
చరిత్ర సృష్టిస్తున్నాం
ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర. మేం చరిత్ర సృష్టిస్తున్నాం. ఏపీకి ఏదో చేయాలి అని ఇక్కడున్న పెద్దలందరూ అహర్నిశలు కృషిచేస్తున్నారు. విభజనతో మనం చాలా నష్టపోయాం. దక్షిణ భారతదేశంలో ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. దీనిని అధిమించాలని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు వీరు. ఈ యజ్ఞంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గెలుపు కోసం నేను ఎక్కువ కష్టపడుతున్నాను. ఎందుకంటే ఐటీ కంపెనీలు ఎక్కువగా భీమిలికే వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు.
ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ జీఎంఆర్
జీఎంఆర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. ఇక్కడే మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన పదో తరగతి ఫెయిల్ అయ్యారు. తర్వాత పట్టుదలతో చదివి దేశానికే కాదు.. ప్రపంచానికే అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. జీఎంఆర్ శంషాబాద్ విమానాశ్రయం నిర్మించాలని భావించినప్పుడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబుకి సందేహం ఉండేది. తర్వాత తన సామర్థ్యం నిరూపించుకున్నారు. చంద్రబాబుని ఒప్పంచి ప్రపంచంలో నెం.1 ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు. అనుకున్నది సాధించారు. ఈ రోజు తెలంగాణ జీడీపీలో 12 శాతం జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ అందిస్తోంది. ఎయిర్‌పోర్ట్ కు 5వేల ఎకరాలు అవసరమా అని ఆనాడు ఎగతాళి చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ రోజు వెళ్లి చూడండి. బెంగళూరు, చెన్నైల్లో రెండో ఎయిర్ పోర్ట్ నిర్మించే పరిస్థితి ఉంది. చంద్రబాబు విజన్ వల్ల హైదరాబాద్‌కు ఆ అవసరం లేదు. వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మించారని మంత్రి లోకేష్ వివరించారు.
గొప్ప వ్యక్తులు పూసపాటి వంశీయులు
విజన్ అనేది చాలా అవసరం. కొంతమంది విజన్‌లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. ఈ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు అశోక్ జగపతి రాజుని కలిసిన తర్వాత ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్‌ఫోర్స్‌లో 25 శాతం తెలుగువారు ఉండాలనేది తన లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో కనీసం 70శాతం వర్క్ ఫోర్స్ తెలుగువారు ఉండాలన్నారు. ముఖ్యమంత్రిగా తన సహకారం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు తన విజన్‌తో ఒక వరల్డ్ క్లాస్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏదో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కాదు.. కామన్ ఇన్‌ఫ్రాస్టక్చర్, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని మేమంతా భావించాం. బెస్ట్ ఇన్ క్లాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీని తీసుకువస్తేనే మన ప్రాంత రూపురేఖలు మారతాయని ఆనాడు మేం తీసుకున్న ఒక నిర్ణయం ఇది.
ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న సమయంలో విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు. మాన్సాస్ ట్రస్ట్‌కు ఉన్న భూముల గురించి వివరించారు. వరల్డ్ క్లాస్ ఇన్‌స్టిట్యూట్‌ను తీసుకువస్తే ఉచితంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు. వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం వారిది. అయితే ఎంవోయూ ఫైల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. నేను ఫాలో అప్ చేస్తున్నప్పుడు సీఎం సెక్రటరీ నాకు ఫోన్ చేసి ఉచితంగా భూమి ఇస్తున్నారని ఫైల్‌లో ఉందని, ఇది సాధ్యం కాదు అన్నారు. టోకెన్ అమౌంట్ కానీ, రూపాయి అయినా కట్టాల్సి వస్తుందేమో అన్నారు. ఈ విషయం గురించి ఎమ్మెల్యే అదితికి ఫోన్ చేసి చెప్పినప్పుడు రూపాయికి కూడా వారు ఒప్పుకోలేదు. గొప్ప మనసుతో వారు ఉచితంగా భూములు అందించారు. మా బ్లడ్ లోనే ఏవియేషన్ ఉందని, మాన్సాస్ పేరు పెడితే చాలని చెప్పారు. ఇందుకు సభాముఖంగా అశోక్ గజపతిరాజుకి, అదితికి మంత్రి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియశారు.
ప్రపంచానికే ఆదర్శంగా..
ఈ ఎడ్యుసిటీ కేవలం దేశానికి, రాష్టానికే కాదు.. ప్రపంచానికే ఆదర్శంగా నిలవబోతోంది. ఐఎస్‌బీ సంస్థ గురించి ఏ విధంగా విన్నారో దానికంటే బెటర్‌గా ఉంటుంది. ఏవియేషన్ ఎడ్యుసిటీని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని మేం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. క్లసర్ విధానంలో ముందుకు వెళ్తాం. వివిధ జిల్లాల్లో 20కి పైగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఈ క్లస్టర్లలో కేవలం కంపెనీలు తీసుకురావడమే కాకుండా.. మొత్తం ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తాం. ఏవియేషన్ రంగంలో ఒక ఇంజన్ తయారు చేయాలంటే సుమారు వెయ్యి కంపెనీలు వాళ్ల కాంపోనెంట్స్ అందిస్తారు. ఇది వర్టికల్ విధానం. హారిజాంటల్ క్లస్టర్ విధానంలో ఎడ్యుకేషన్ కీలకం. ఏవియేషన్ ఎడ్యుకేషన్ అనేది హారిజాంటల్ విధానమని మంత్రి లోకేష్ వివరించారు.
ఎడ్యుకేషన్‌ను ఇండస్ట్రీని ఇంటిగ్రేడ్ చేస్తాం
ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి క్లస్టర్‌లో సిస్టమాటిక్ అప్రోచ్‌తో ముందుకు వెళ్తున్నాం. ఎడ్యుకేషన్‌ను ఇండస్ట్రీని ఇంటిగ్రేడ్ చేస్తాం. యువకులను జాబ్ రెడీగా తయారుచేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. క్లస్టర్ బేస్ అప్రోచ్ మోడల్ ఫాలో అయ్యే ఒకే ఒక దేశం చైనా. ఇప్పుడు క్లస్టర్ బేస్ అప్రోచ్ ను ఏపీ కూడా తీసుకుంటోంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాం. ప్రజల సహకారం కూడా చాలా అవసరమని మంత్రి లోకేష్ కోరారు.
అందుకే టీసీఎస్, కాగ్నిజెంట్ రాక
ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే భూములు ఇస్తామంటే చాలామంది ఎగతాళి చేశారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయి. రాబోయే వంద రోజుల్లో మరో రెండు ఐటీ కంపెనీలు కూడా విశాఖకు రానున్నాయి. చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నాం. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు. ప్రకృతి సహకరిస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐఎస్‌బీ ఏర్పాటుచేసినప్పుడు చాలా మంది సాహసోపేత నిర్ణయం అన్నారు. అయినా అప్పల్లో సీఎం చంద్రబాబు వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజు హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో చూశాం. అలాంటి సాహసోపేత నిర్ణయాలు మేం కూడా తీసుకుంటున్నాం. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ అన్నారు.
12 నెలల్లో అభివృద్ధి చేస్తాం
ఢల్లీిలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసి స్టూడెంట్ మాక్ అసెంబ్లీ గురించి వివరించాను. బాలల రాజ్యాంగ పుస్తకం గురించి చెప్పాను. దేశవ్యాప్తంగా ఈ మోడల్‌ను ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహకారంతో ఇదంతా చేయగలిగామని చెప్పాను. మిస్సైల్, జీపీఎస్‌కు ఓ ఉదాహరణ చెబుతాను.
శాసనసభలోనే స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహణకు నేను విజ్ఞప్తి చేశాను. రూల్స్ అంగీకరించవని అయ్యన్నపాత్రుడు చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే శాసనసభ సెట్టింగ్ వేసి నిర్వహించాలని చెప్పారు. కొంతమంది ప్రతిపక్ష నేతలకు మేము ఎక్కడ మాక్ అసెంబ్లీ నిర్వహించామో కూడా తెలియదు. మాపై ఆరోపణలు చేశారు. జీపీఎస్ గొప్పతనం ఏంటో అప్పుడు నాకు అర్థమైంది. యువ మిస్సైల్స్ రెడీగా ఉన్నాయి. అద్భుతమైన జీపీఎస్‌లు కూడా మాకు ఉన్నాయి. మాకు ఏదైనా గైడెన్స్ కావాలంటే సమయానుకూలంగా మార్గదర్శకం చేస్తారు. టీడీపీలో పనిచేయడం మాలాంటి వారికి అదృష్టం. ఓ వైపు సీనియర్ల గైడెన్స్, ప్రోత్సాహం మాకు దక్కుతోంది. మరోవైపు సీఎం మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి మరో సెక్టార్‌లో యూనివర్సిటీ తీసుకురావాలని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించిన గైడెన్స్ కూడా అప్పుడే ఇచ్చారు. ఎడ్యుసిటీ ఏర్పాటులో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సహకారం కూడా ఎనలేనిది. 12 నెలల్లో ఎడ్యుసిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, ఏపీ శానససభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జీఎంఆర్ సంస్థల ఎయిర్ పోర్ట్స్ ఛైర్మన్ జీబీఎస్ రాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తదితరులు పాల్గొన్నారు.











