- విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
- గవర్నర్ నివాసం ‘లోక్‌భవన్’కు అథారిటీ ఆమోదం
- రూ.7380 కోట్ల నాబార్డు రుణ స్వీకరణకు నిర్ణయం
- తెలుగు వైభవంగా నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ సమావేశం
అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతిని సృజనాత్మక నగరంగా తీర్చిదిద్దనున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే ప్రతీ భవనం విలక్షణంగా ఉండాలని సూచించారు. నిర్మించే ప్రతీ భవనం ప్రస్ఫుటంగా కనిపంచే విధంగా, పచ్చదనంతో అలరారేలా నిర్మించాలని పేర్కొన్నారు. రాజధాని నగరంలో భవనాల డిజైన్ల కోసమే గతంలో విస్తృతంగా అధ్యయనం నిర్వహించామని సీఎం గుర్తు చేశారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. సీఆర్డీఏ, ఏడీసీ ప్రతిపాదించిన కొన్ని అంశాలకు సమావేశం ఆమోదాన్ని తెలిపింది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో గవర్నర్ నివాస సముదాయం లోక్ భవన్ నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. రూ.169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ.165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యూడిషియల్ అకాడెమీ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే 2024-25 వార్షిక గణాంకాల నివేదికలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు నుంచి రూ.7,380 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు సీఎం అధ్యక్షతన సీఆర్డిఏ అథారిటీ అంగీకారాన్ని తెలిపింది. ఈ-3 సీడ్ యాక్సెస్ రహదారిని ఎన్ హెచ్ `16 జాతీయ రహదారితో అనుసంధానించేందుకు రూ.532 కోట్లతో టెండర్లను పిలిచేందుకు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలిపింది.
తెలుగు ప్రజల ప్రాజెక్టుగా ఎన్టీఆర్ విగ్రహం
రెండో విడత భూసమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్, ఎల్పీఎస్ ప్రణాళికలకు ముఖ్యమంత్రి ఆమోదాన్ని తెలిపారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో చేపట్టిన నిర్మాణాల్లో 85 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ భవనాలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, జడ్జిలు, ప్రభుత్వోద్యోగుల నివాస భవనాలతోపాటు రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, ఎల్పీఎస్ లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనలాంటి వేర్వేరు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన సీఎం నిర్మాణాల్లో వేగంతోపాటు నాణ్యతపైనా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువుకంటే ముందే భవన నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సీఆర్డీఏ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టాలని సీఆర్డీఏను ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండవద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఉన్న వేర్వేరు ప్రాజెక్టులను అధ్యయనం చేయాలన్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, అల్లూరి, పొట్టిశ్రీరాములులాంటి విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, రాష్ట్రానికి ఉన్న వనరులు, స్ఫూర్తిదాయక, చారిత్రక కట్టడంగా విగ్రహాన్ని నిర్మించాలన్నారు. తెలుగు ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రాజెక్టును చేపట్టాలని సీఎం సూచనలిచ్చారు. సమావేశంలో పురపాలక మంత్రి పి నారాయణ, సీఎస్ కె విజయానంద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు హాజరయ్యారు.












