- వ్యాధి విస్తృతానికి ముందే చికిత్సలు అందించండి
- స్క్రబ్ టైఫస్ కేసులు నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఇది అంటువ్యాధి కాదని సీఎం దృష్టికి తచ్చిన అధికార్లు
అమరావతి (చైతన్య రథం): స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్తోతో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి చందక రాజేశ్వరి మృతి చెందిన తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చిగ్గర మైట్ తరహా కీటకాలు కుట్టడంవల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్నిఏవిధంగా కట్టడి చేయాలనేదానిపై ప్రజలకు వివరించాలన్నారు. ఈ క్రమంలో చందక రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రికి సౌరభ్ గౌర్ వివరించారు. విజయనగరానికి చెందిన రాజేశ్వరీ అనే మహిళను చిగ్గర్ మైట్ అనే కీటకం కుట్టిందని, దీంతో ముందుగా టైఫాయిడ్ చికిత్స అందించారని… తర్వాత రాపిడ్ టెస్ట్ ద్వారా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేల్చారని సౌరభ్ గౌర్ సీఎంకు వివరించారు. విజయనగరం క్వాసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోయారని అధికారులు చెప్పారు. స్క్రబ్ టైఫస్ కేసులు, ఆ వ్యాధి లక్షణాలు, అలాగే వాటివల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోననే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు..
ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. చిగ్గర మైట్స్ అనే కీట కాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, అధిక జ్వరం, చలి,తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పుల తోపాటు… మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం వంటివి వ్యాధి లక్షణాలని సీఎంకు వివరించారు. సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఈమేరకు స్క్రబ్ టైఫస్వంటి వ్యాధిపట్ల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకునేలా అధికారులు చూడాలన్నారు. ఏవైనా కీటకాలు కుట్టిన వెంటనే పరీక్షలు చేయిం చేలా చూడాలని… వ్యాధి తీవ్రత పెరగకముందే అవసరమైన చికిత్స అందించేలా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఈఏడాదిలో చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. చిన్న చిన్న కీటకాలు కుడితే మృత్యువాతపడే స్థాయికి పరిస్థితి రాకూడదని… పూర్తిస్థాయిలో అవగాహన పెంచడమే దీనికి సరైన మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.












