- అదే టీడీపీ సిద్ధాంతం
- పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
- వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలన ఎలా ఉందో చూశాం
- మనం సైకోతో పోరాడుతున్నామనే విషయం గుర్తుంచుకోవాలి
- ప్రజల మనస్సులు గెలుచుకునే విధంగా పనిచేయాలి
- ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
- మండల పార్టీ అధ్యక్షులతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం
అమరావతి (చైతన్యరథం): గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనేది పార్టీ సిద్ధాంతం, విధానం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజల మనస్సులు గెలుచుకునే విధంగా పనిచేయాలి. స్థానిక ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోవాలి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా ‘‘కాఫీ కబుర్లు’’ పేరుతో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అనేది యూనివర్సిటీ లాంటిందన్నారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు 2012లో మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్రస్థాయి నేతలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేయాలనేది పార్టీ సిద్ధాంతం, విధానం. పార్టీ లేకపోతే మనం ఎవరం లేము. మనకు గుర్తింపు, గౌరవం దక్కుతున్నాయంటే కారణం తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని విస్మరించకూడదు. పార్టీ అనేది సుప్రీం అని యువనేత లోకేష్ అన్నారు.
పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి
మండల పార్టీ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా మిమ్మల్ని నియమించింది పార్టీ. ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి పార్టీ నియమించింది. పార్టీకి నిబద్ధతతో పనిచేయాలి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. పార్టీ కుటుంబం లాంటింది. చిన్న, చిన్న సమస్యలు సహజం. పార్టీలో సంస్కరణల కోసం నేను రెండేళ్లు పోరాడాను. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ తూచా తప్పకుండా సదరు నిర్ణయాలను పాటించాలి. పార్టీ నేతలు అలక వీడాలి. సమస్యలు ఏవైనా ఉంటే సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకురావాలని లోకేష్ సూచించారు.
స్థానిక ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోవాలి
వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలన ఎలా ఉందో చూశాం. గతంలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 67 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. మన అధినేత చంద్రబాబుని సైకో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించారు. మనం సైకోతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరం ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే విజయాలు సాధిస్తాం. క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్‌లు, కుటుంబ సాధికార సారథులతో కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రజల మనస్సులు గెలుచుకునే విధంగా పనిచేయాలి. అహంకారం వద్దని ప్రజలు చెబుతున్నారు. మనం ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. స్థానిక ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోవాలని లోకేష్ ఉద్బోధించారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
వారంలో ఒకరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటాను. సమయం కేటాయిస్తాను. మీ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం. ప్రతిఒక్కరు ‘మై టీడీపీ’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ద్వారానే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటాం. పెన్షన్ పంపిణీ, తదితర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనాలి. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదు. చేసే పని చెప్పుకోవాలి. ఓర్పు, సహనంతో ప్రజలతో మమేకం కావాలి. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. జీవితాంతం నేర్చుకోవాలనే ఆలోచన వస్తే విజయవంతం అవుతాం. కష్టం లేనిదే ఫలితం రాదు. నేను పాదయాత్ర చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చా. అందరూ కష్టపడాలి. అప్పుడే ఫలితాలు వస్తాయని
మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు.
మొదటి రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వంద మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అంతకుముందు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నాలుగు విభాగాలుగా విభజించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు ఎన్.అమర్ నాథ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష వారికి పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, మండల పార్టీ అధ్యక్షుల విధులు, బాధ్యతలపై మార్గదర్శనం చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల అభిప్రాయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు నివేదించారు.














