- ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
- పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలి..
- డిసెంబర్ క్యాలెండర్ ను దిగ్విజయం చేయండి
- పార్టీ నేతలకు జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పిలుపు
- మంత్రులు, ఎంపీలు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్
అమరావతి (చైతన్య రథం): ‘పేదల సేవలో’ కార్యక్రమానికి నేతలంతా హాజరై మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలుగు దేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు పిలుపునిచ్చారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, బూత్అయి కార్యకర్తలతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో నేతలంతా పాల్గొనాలని సూచించారు. “నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణిస్తారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించాలి. పింఛన్ల పంపిణీని నేతలందరూ పేదల సేవగా భావించాలి” అని పిలుపునిస్తూనే.. ఈ కార్యక్రమంలో నేతల భాగస్వామ్యం 25 వేలకు చేరిందని చంద్రబాబు వెల్లడించారు. టెలికాన్ఫరెన్స్లో నేతలకు దిశానిర్దేశం చేస్తూ.. “పార్టీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ నెల క్యాలెండర్ రూపొందించాం. ప్రతినెలా 1న ఎలాంటి ఆటంకమూ లేకుండా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. కేటగిరీలవారీగా రూ.4 వేలనుంచి 15 వేల వరకూ పింఛను మొత్తాన్ని లబ్దిదారులకు అందిస్తున్నాం. వృద్ధాప్య పింఛను లబ్దిదారులకు ఏటా రూ.48 వేలచొప్పున, డయాలసిస్ రోగులకు ఏడాదికి రూ.1.20 లక్షల చొప్పున అందుతోంది. పూర్తిగా మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు రూ.1.8 లక్షల చొప్పున ఏడాదికి ఆర్థిక సాయం అందిస్తున్నాం.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దమొత్తంలో లబ్దిదారులకు ఆర్థిక సాయం అందటం లేదు. కేవలం పెన్షన్ల కోసమే ఇప్పటి వరకు రూ.50,763 కోట్లు ఖర్చు పెట్టాం. దేశంలోనే ఇదిఅతిపెద్ద డీబీటీ కార్యక్రమం. ప్రజలకు సంతృప్తినిస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో 17 నెలలుగా నేను స్వయంగా పాల్గొని పెన్షన్ అందిస్తున్నా. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి చెబితే కూటమిని కాదని పక్క పార్టీలకు ప్రజలు ఓటు వేయరు” అని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ.. “పొలిటికల్ గవర్నెన్సు అన్నది కూటమి ప్రభుత్వ విధానం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించటంతోపాటు ప్రజలతో నేతలు మమేకం కావాలి. కార్యకర్తల మనోభీష్టం మేరకే నాయకత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. 12 లక్షలమంది కుటుంబ సాధికార సారధులు, 46 వేల బూత్, 8 వేలమందితో కూడిన యూనిట్ వ్యవస్థల మనకు ఉంది. వీరంతా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీయే సర్వస్వంగా కార్యకర్తలు ఆస్తులు ప్రాణత్యాగాలు చేశారు. పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తున్నాం అందరితో సమన్వయం చేసుకుని పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండాలి.
డిసెంబరు 3న రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాపుల ద్వారా రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 5న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోనూ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు హాజరు కావాలి. త్వరలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఉమ్మ కుటుంబాలకు మరింత లబ్ది చేకూర్చే విధానం అమలు చేస్తాం. కొన్నిచోట్ల అనర్హులకు పింఛన్లు అందుతున్నాయి. అర్హులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. పార్టీలకు అతీతంగా ఎవరు అర్హులున్నా పెన్షన్లు పథకాలు అందిస్తాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. “గత పాలకుల విధ్వంసంతో రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చాయి రాజకీయ కక్షతో నీరుచెట్టు, ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులను కూడా నిలిపేశారు. కేంద్రంతో మాట్లాడి ఎన్ఆర్ఈజీఎన్ పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయించాం. ఇళ్ల పథకంలోనూ గత పాలకులు నిధులు దారి మళ్లించారు. ఉగాదినాటికి మరో 5 లక్షల ఇళ్లను ప్రజలకు అందిస్తాం. ప్రతీ అర్హుడైన పేదవాడికీ సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల విధ్వంసంపై ప్రజల్లో ఇంకా చర్చ జరగాలి. రేపటి పింఛను పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి” అని పార్టీ జాతీయాధ్యక్షుడు, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.













