- మంచి చెడులు ఆలోచించే శక్తి విద్యార్థులకు ఉండాలి
- సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కొన్నప్పుడే విజయావకాశాలు
- రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదీ
- రాజ్యాంగం హక్కులే కాదు… విధులూ ఇచ్చింది
- విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకే మాక్ అసెంబ్లీ నిర్వహణ
- మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారు
- మహిళలను అవమానించేలా విమర్శలు ఉండకూడదు
- సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవంలో సీఎం చంద్రబాబు
- రాజ్యాంగ విలువలు పుస్తకాన్ని స్పీకర్, మంత్రులతో కలిసి ఆవిష్కరణ
అమరావతి (చైతన్య రథం): సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్తేనే ఏదైనా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారు. సమర్థవంతంగా మాక్ అసెంబ్లీని నిర్వహించిన విద్యార్థులను చూస్తోంటే ముచ్చటేస్తోంది. ఎక్కడా తడబడకుండా ఆత్మవిశ్వాసంతో చక్కగా మాట్లాడిన విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అసెంబ్లీని మరిపించేలా సెటప్ వేశారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే మాక్ అసెంబ్లీ నిర్వహణ ముఖ్యోద్దేశం. 28 ఏళ్ల వయసులోనే నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాను. ఏ పని అయినా పద్ధతిగా చేయడం చిన్నతనంనుంచే అలవాటు చేసుకున్నాను. మా యూనివర్సిటీ వీసీ నన్ను లెక్చరర్ అవ్వమంటే నేను రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యే అవుతానని చెప్పాను. అయితే ఒక్క విజన్ ఉంటే చాలదు. దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. అతి చిన్న వయసులోనే నేను ఎమ్మెల్యే అయ్యాను. 9సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు నాకు అవకాశమిచ్చారు. 30ఏళ్లకే మంత్రి, 45ఏళ్లకే ముఖ్యమంత్రినయ్యాను. నాలుగోసారి సీఎంగా పనిచేస్తున్నాను. స్పీకర్ అయ్యన్నపాత్రుడు 7సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు ఎంపీగా పనిచేశారు’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
‘మనది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. దేశ పౌరులకు ఆయన ఇచ్చిన ఆయుధం రాజ్యాంగం. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి భారత పౌరుడూ తెలుసుకోవాలి. ఓటు హక్కు వజ్రాయుధం. దీంతో ప్రభుత్వాలను మార్చవచ్చు. మన భవిష్యత్‌కు రూపకల్పన చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికలనాటికి మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులందరికీ ఓటు హక్కు వస్తుంది. మాక్ అసెంబ్లీలో ఎక్కువమంది మహిళలు ఉండటం సంతోషాన్ని కలిగిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం మనదే. అమెరికాలో ఇప్పటి వరకూ మహిళ ప్రెసిడెంట్ కాలేదని, మనదేశంలో రాష్ట్రపతి, ప్రధానులయ్యారని’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని
‘ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని అవ్వడమే కాకుండా దేశ దశ, దిశ మార్చారంటే అది మన రాజ్యాంగం గొప్పతనం. సాధారణ కుటుంబంనుంచి అబ్దుల్ కలామ్ రాష్ట్రపతి అయ్యారు. భారతరత్నగా నిలిచారు. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అయ్యారు. సాధారణ కుటుంబంలో పుట్టిన నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే అది రాజ్యాంగం ఇచ్చిన అవకాశమే. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులతోపాటు ప్రాథమిక విధుల్నీ ఇచ్చింది. కొందరు హక్కుల కోసం పోరాడతారు కానీ బాధ్యతలు మాత్రం నిర్వర్తించరు. దేశంలో ఎవరూ రాజ్యాంగానికి అతీతులు కాదు. అందరూ రాజ్యాంగానికి బద్దులై ఉండాలి. శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగం చూపిన బాటలో నడవాలి. సమాజహితం కోసం చట్ట సభలకు రావాలి. కానీ వ్యక్తిగత కక్షల కోసం కాదు. ఏ దేశానికైనా పబ్లిక్ పాలసీలు అవసరం. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ విప్లవానికి నాంది పలికాం. ఇంజనీరింగ్ కాలేజీలు, జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టాం. నాలెడ్జ్ ఎకనామీలో తెచ్చిన ఐటీ పాలసీవల్ల తలసరి ఆదాయం పెరిగింది. నేడు వందల దేశాల్లో మన తెలుగువారు ఉద్యోగాలు పొందుతున్నారు’’ అని సీఎం అన్నారు.
ఆకతాయిలు హేళన చేస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి
‘మహిళలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. మొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. మహిళా యూనివర్సిటీ తెచ్చారు. నేను వచ్చాక డ్వాక్రా వ్యవస్థను స్థాపించి మహిళల ఆర్థిక ప్రగతికి బాట వేశాను. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. సోషల్ మీడియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. మహిళల వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలి. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. ఆకతాయిలు అవహేళన చేస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. సమాజంలో ఆడపిల్లల్లా ఏడవద్దు.. గాజులు తొడుక్కున్నావా.. లాంటి మాటలు మాట్లాడటం మానుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
మోదీ నాయకత్వంలో దేశానికి ప్రపంచఖ్యాతి
‘భిన్న కులాలు, మతాలు, జాతులున్న భారత దేశం ఐక్యంగా ఉండలేదని ఆ నాటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మనల్ని అవహేళన చేశాడు. ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. అతి త్వరలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మారనుంది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాకారం చేసుకుందాం. చిన్నతనంలో లాంతరు వెలుగులో చదువుకున్న నేను.. 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి వచ్చాం. విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేయాలి. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే విచక్షణా శక్తి పిల్లలకు రావాలి. వారికి విలువల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే చాగంటి కోటేశ్వరరావుని నియమించాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. మాక్ అసెంబ్లీ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేశారు. కాన్సిటిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











