- వాటాల కేటాయింపుపై పునఃసమీక్షకు ఒప్పుకునేది లేదు
- రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించండి
- సామరస్యంగా వరద జలాల వినియోగానికి సిద్ధం
- జలవనరుల శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): కృష్ణా నదీ జలాలపై ఏపీకి ఉన్న హక్కులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులూ చేసేందుక వీలులేదని, చట్టపరంగా ఏపీకి దక్కిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. బుధవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీ వాటా కలిగి ఉండగా… రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్-1 ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీ చొప్పన జలాలు కేటాయించిందన్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపులను పునఃసమీక్షించాలనడం సరికాదని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ ఏటా వేలాది టీఎంసీ జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు.
అన్ని జిల్లాలకు నీటి భద్రతే లక్ష్యం
రాష్ట్రాన్ని కరవు రహితం చేసేలా… అన్ని జిల్లాలకు నీటి భద్రత కలిగించేలా… సమర్ధ నీటి నిర్వహణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వాయర్లలో నెలకొన్న నీటి నిల్వల వివరాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 25నాటికి రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం 1,095 టీఎంసీ వరకు నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు అన్నీ కలిపి సామర్ధ్యంలో 83.43 శాతంమేర నిండాయని వివరించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసినా పలు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండక పోవడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని అధికారులకు సూచించారు. గ్రావిటీ ద్వారా పూర్తిస్థాయిలో నిండని రిజర్వాయర్లను గుర్తించి… వాటిని లిఫ్ట్ ద్వారా నింపేందుకు చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్రంలో పెరిగిన భూగర్భజలాలు
గత ఏడాది సగటున 7.45 మీటర్ల లోతున భూగర్భ జలాలుండగా… ఈ ఏడాది 6.8 మీటర్లకు పెరిగింది. కోస్తాంధ్రలో 6.77 మీటర్లనుంచి 6.56 మీటర్లకు, రాయలసీమలో 9 నుంచి 7.34 మీటర్లకు భూగర్భజల మట్టాలు పెరిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 8 మీటర్లకన్నా దిగువనున్న 5,697 గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున భూగర్భ జలాలు 3 మీటర్లకు తీసుకురావాలనేదే లక్ష్యమని, దీనికి అనుగుణంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 73 శాతంమేర పూర్తికాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. అలాగే బట్రస్ డ్యామ్ పనులు పూర్తిచేసినట్టు వివరించారు. వైబ్రో కాంపాక్షన్ పనులు 97 శాతంమేర జరిగాయని, వచ్చే నెలాఖరుకు పనులు పూర్తి కానున్నట్టు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులు కొలిక్కి వస్తుండటంతో ప్రాజెక్టులో ప్రధాన భాగమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, ఆర్‌ఆర్ ప్యాకేజ్‌ని నిర్వాసితులకు వేగంగా అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు.











