అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపడుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం చెన్నైలోని హిల్టన్ హోటల్లో జరిగిన ఇండో – జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 59వ వార్షిక ప్రాంతీయ సమావేశానికి, ఏపీ తరుపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండో-జర్మన్ సహకారాన్ని బలోపేతం చేసే ఒప్పందంపై ఇరుపక్షాల అధికారులు సంతకం చేశారు. సుమారు 200 మంది జర్మన్ కంపెనీల సీఈవోలు, సీఎఫ్వోలు, తదితర ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అన్ని అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రెడీ టు ఇన్‌స్టాల్ పద్ధ్దతిలో పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం స్వాగతం పలుకుతోందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎగుమతులపై అవగాహన, ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్న వస్తువుల తయారీ, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎంఎస్‌ఎంఈ పార్క్ లలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కల్పన సహా పలు అంశాలపై జర్మనీ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది.












