- సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్యరథం): విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులకు సంబంధించి నిధుల మంజూరు కోసం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మున్నేరు పాత ఆనకట్ట వద్ద తాత్కలికంగా రింగ్ బండ్ల ఏర్పాటుకు రూ.71.45 లక్షలు, నందిగామ నియోజకవర్గంలో కంచెల ఎత్తిపోతల పథకం అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు , తిరువూరు నియోజకవర్గం వినగడప వద్ద వున్న కట్లేరు బ్రిడ్జ్ నిర్మాణం నిమిత్తం రూ.30 కోట్లు మంజూరు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
`











