- ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్
- ఐదు అంశాలను అనుసంధానించనున్న ఏపీ-లింక్
- భారీగా పెట్టుబడులు ఆకర్షించాలన్న ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్య రథం): ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఎల్‌ఐఎన్‌సి) ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హోల్డింగ్ కంపెనీ తరహాలో ఏపీ-లింక్ వ్యవహరించనుంది. మొత్తంగా ఐదు రంగాలను ఈ కార్పొరేషన్ అనుసంధానించనుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, అంతర్గత జలరవాణా, గిడ్డంగులు.. వీటిని అనుసంధానిస్తూ లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడంతో పాటు… లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ఏపీ లింక్ బాధ్యత తీసుకోనుంది. ఇక రాష్ట్రంలోని లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, సమన్వయం, పర్యవేక్షణకు ఏపీ లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ కార్పొరేషనుకు ఎండీ, వివిధ అనుబంధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సలహా కమిటీ, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను అమలు చేయడానికి జిల్లాస్థాయి సెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వివరాలను ఐ అండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీ లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని… అలాగే క్షేత్రస్థాయిలో వివిధ రంగాలకు అవసరమైన లాజిస్టిక్స్ అందించే విషయంలో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.











